Oral Pill : బిగ్ రిలీఫ్.. త్వరలో కరోనా చికిత్సకు ట్యాబ్లెట్లు.. గణనీయంగా తగ్గిన వైరస్ లోడ్

Oral Pill : బిగ్ రిలీఫ్.. త్వరలో కరోనా చికిత్సకు ట్యాబ్లెట్లు.. గణనీయంగా తగ్గిన వైరస్ లోడ్

Oral Pill

Oral Pill : కరోనా చికిత్సకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనాను ఖతం చేసే మందుల తయారీలో శాస్త్రవేత్తలు, డాక్టర్లు నిమగ్నం అయ్యారు. కోవిడ్ రాకుండా ఉండేందుకు ఇప్పటికే వ్యాక్సిన్(టీకా) తీసుకొచ్చారు. పలు కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. టీకా రెండు డోసులు తీసుకుంటే.. కరోనా నుంచి కొంతవరకు రక్షణ లభిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, కరోనా చికిత్సకు సంబంధించి కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మెడిసిన్ తయారీలో డాక్టర్లు నిమగ్నం అయ్యారు.

ఈ క్రమంలో బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా చికిత్సకు త్వరలో సరికొత్త ట్యాబ్లెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రిడ్జిబ్యాక్‌ బయోథెరప్యూటిక్‌-మెర్స్క్‌‌ అండ్‌కో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మోల్నుపిరావిర్‌ ఔషధంపై ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు మధ్య దశలో ఉన్నాయి. ఐదురోజుల పాటు ఈ ఔషధాలతో చికిత్స చేస్తే వైరస్‌ లోడు గణనీయంగా తగ్గిపోయిందని ఇన్‌ఫెక్షియస్‌ డిసీజ్‌ సైంటిస్ట్‌ల వర్చువల్‌ సమావేశంలో రిడ్జిబ్యాక్‌ వెల్లడించింది.

ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు రెమిడెసివిర్‌తో చికిత్స నిర్వహిస్తున్నారు. దీనికి కూడా 100శాతం ఫలితాలు రావడం లేదు. ఫావిపిరవిర్‌ పిల్స్‌ ఇస్తున్నారు. ఇది కొవిడ్‌ కోసం అభివృద్ధి చేసిన ఔషధం కాదు. దీంతో పూర్తిస్థాయి ఫలితం ఆశించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో కరోనా చికిత్సకు మాత్రమే ట్యాబ్లెట్లు అందుబాటులోకి వస్తే అది భారీ ఉపశమనంగా మారుతుంది.

గతంలో ఫ్లూపై టామీ ఫ్లూ ఎలా పనిచేసిందో.. ఇప్పుడు మోల్నుపిరావిర్‌ కూడా కరోనాపై అలా పనిచేస్తుందని ఆశిస్తున్నారు. ‘‘ఇది ఆశాజనకంగా ఉంది.. కానీ, నూరుశాతం పని చేస్తుందని చెప్పలేము. దీనికి క్లినికల్‌ ఉపయోగాలు ఉంటాయని నిరూపించడమే మా కర్తవ్యం’’ అని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజ్‌లో ఎయిడ్స్‌ విభాగ డైరెక్టర్‌ కార్ల్‌ డైఫెన్‌ బ్యాచ్‌ తెలిపారు.

మిగిలిన ఔషధాలకు భిన్నంగా..
ఇప్పటికే ఈ ఔషధంపై అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఆంతోనీ ఫౌచీ కూడా సానుకూలంగా స్పందించారు. సార్స్‌ కోవ్‌-2 వైరస్‌పై నేరుగా పనిచేసే ఔషధాల అభివృద్ధి అవసరమని ఇటీవల ఆయన అధ్యక్షుడికి తెలిపారు. సాధారణ ఔషధాల వలే మోల్నుపిరావిర్‌ సార్స్‌కోవ్‌-2 స్పైక్‌ ప్రొటిన్‌పై ఇది పని చేయదు. ఇది నేరుగా వైరస్‌ ఉత్పత్తిని తగ్గించేసేలా ఒక ప్రత్యేకమైన ప్రొటీన్‌పై ప్రభావం చూపిస్తుంది.

ఫేజ్‌-2 ఫలితాలు ఇవి..
ఫేజ్‌-2 ప్రయోగాల్లో భాగంగా మొత్తం 182 మందిపై దీనిని ప్రయోగించారు. రెండు పూటలా మోల్నుపిరావిర్‌ తీసుకున్న వారిలో ఐదురోజుల తర్వాత వైరస్‌ జాడ కనిపించలేదు. అదే ప్లెసిబో (డమ్మీటాబ్లెట్‌) తీసుకొన్న వారిలో 24శాతం మందిలో మాత్రమే ఇటువంటి ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని రిడ్జ్‌బ్యాక్‌ వెల్లడించింది. ఈ ఔషధం కరోనావైరస్‌ శరీరంలో పునరుత్పత్తి చేయడకుండా సమర్థంగా అడ్డుకుంటోందని రిడ్జిబ్యాక్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు వేనే హోల్మన్‌ తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థ ఎబోలాకు చికిత్సను అభివృద్ధి చేసి.. దానికి అనుమతులు కూడా పొందింది. ప్రస్తుతానికి ఇది మధ్యంతర ఫలితాలే అని.. నెలాఖరుకు దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మెర్స్క్‌ సంస్థ తెలిపింది.