కరోనాతో ప్రముఖ సింగర్ మృతి

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 10:14 AM IST
కరోనాతో ప్రముఖ సింగర్ మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా దెబ్బకు వేల సంఖ్యలో చనిపోయారు. ఆ దేశం ఈ దేశం అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. తాజాగా కోవిడ్ 19 వైరస్ మహమ్మారి అమెరికాకు చెందిన ప్రముఖ కంట్రీ సింగర్‌ జో డిఫీని బలితీసుకుంది. ఆయన వయసు 61 ఏళ్లు. 1990 దశకంలో జో డిఫీ అమెరికన్‌ జానపద సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. సంగీత ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డులుగా భావించే గ్రామీ అవార్డులు కూడా ఆయన గెలుచుకున్నారు.

తనకు కోవిడ్ సోకినట్టు జో డిఫీ రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. పికప్ మ్యాన్, ప్రాప్ మీ ఆఫ్ బిసైడ్ ద జూక్‌బాక్స్, జాన్ డీర్ గ్రీన్ వంటి పాటలు ఆయనను ప్రపంచానికి పరిచయం చేశాయి. తన పాటలతో 90లలో అమెరికన్ సమాజాన్ని ఉర్రూతలూగించారు. గ్రామీ అవార్డులను కూడా పలుమార్లు జో అందుకున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 34వేల మంది మరణించారు. కరోనా కేసుల సంఖ్య 7లక్షల 23వేల 643కి పెరిగింది. ఇప్పటివరకు లక్ష 51వేల 4 మంది కోలుకున్నారు. యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. న్యూయార్క్ లో ఇప్పటివరకు వెయ్యి మంది కరోనాతో చనిపోయారు. మరో 2 వారాల్లో అమెరికాలో కరోనా మరణాల రేటు పెరగనుందని ట్రంప్ ప్రభుత్వం అంచనా వేసింది. జూన్ వరకు కరోనాను కంట్రోల్ చేయడం కష్టమేనని స్వయంగా ట్రంప్ చెప్పడం అమెరికన్లను ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read | WhatsApp Status వీడియో టైం తగ్గిపోనుంది!!