Covid Fourth Wave : మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ?

ఇంకెక్కడిది.. అంతా అయిపోయింది.. ఇప్పుడు లేదు.. ఇక రాదనుకుంటున్న వైరస్.. మళ్లీ రాబోతోందా? ఇండియాలో.. కరోనా ఫోర్త్‌వేవ్‌ ముంచుకొస్తోందా.?

Covid  Fourth Wave : మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ?

Covid Fourth Wave :  ఇంకెక్కడిది.. అంతా అయిపోయింది.. ఇప్పుడు లేదు.. ఇక రాదనుకుంటున్న వైరస్.. మళ్లీ రాబోతోందా? ఇండియాలో.. కరోనా ఫోర్త్‌వేవ్‌ ముంచుకొస్తోందా.? ఇప్పటికే శాంతించిన మహమ్మారి.. మళ్లీ కోరలు చాచేందుకు సిద్ధమైందా.? తూర్పు ఆసియా దేశాల్లో పెరుగుతున్న కేసులు.. దేనికి సంకేతం? కచ్చితంగా చెప్పలేం గానీ.. నిర్లక్ష్యం వహిస్తే మాత్రం.. పెను ముప్పు తప్పకపోవచ్చంటున్నారు.

కరోనా ముసురు మళ్లీ కమ్ముకోవచ్చన్న అంచనాలు.. ఆందోళన కలిగిస్తున్నాయ్. ఇందుకు.. సౌత్ కొరియా, చైనాలో పెరుగుతున్న కేసులే బిగ్ ఎగ్జాంపుల్. అందుకే.. జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. కరోనా థర్డ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. ఫోర్త్‌వేవ్‌ను కూడా ముందు నుంచే కంట్రోల్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆసియా దేశాల్లో కేసులు పెరుగుతుండడంతో.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చర్యలు తీసుకోవాలంటూ.. రాష్ట్రాలకు అలర్ట్ చేసింది కేంద్రం.

వైరస్‌ పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించింది. ప్రజలంతా నిబంధనలు పాటించేలా చూడాలని, టెస్టులు పెంచాలని సూచించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌పై దృష్టి సారించాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. కోవిడ్ టెస్టులు పెంచాలని, కొత్త కేసుల క్లస్టర్లపై నిఘా పెట్టాలని సూచించింది. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం లాంటి నిబంధనలపై అలసత్వం వద్దని తెలిపింది.

కరోనా కథ ముగిసినట్లే కనిపించిన ప్రతిసారీ.. ఊహించని రీతిలో వైరస్‌ పడగ విప్పుతోంది. చైనాలో పరిస్థితి.. రోజురోజుకు దిగజారుతోంది. ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌.. స్టెల్త్‌ ఒమిక్రాన్‌ విజృంభణతో చైనా వణికిపోతోంది. కఠిన లాక్‌డౌన్‌లను అమలు చేస్తున్నా.. కేసులు తగ్గకపోవడంతో డ్రాగన్ కంట్రీ తీవ్ర ఆందోళన చెందుతోంది. గతేడాది జనవరి 26న చివరిసారిగా చైనాలో కరోనా మరణం నమోదవగా.. మళ్లీ 14 నెలల తర్వాత మరో మరణం సంభవించింది.

అటు.. సౌత్ కొరియా పరిస్థితి దారుణంగా తయారైంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే.. 4 లక్షల వరకు కేసులొస్తున్నాయంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన వారంలోనే.. దక్షిణ కొరియాలో 35 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలోని.. 87 శాతం జనాభాకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తవగా.. 63 శాతం జనాభాకు బూస్టర్‌ డోసులు కూడా వేశారు. అయినా కూడా కేసుల ప్రవాహం ఆగడం లేదు.

Also Read : CM KCR Delhi Tour : సమరమే… వస్తున్నా ఢిల్లీకి..

వియత్నాంలోనూ వైరస్.. ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. గడిచిన వారంలో 20 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. చైనా, దక్షిణ కొరియా, వియత్నాంలో.. మళ్లీ మహమ్మారి విజృంభించడానికి ఒమిక్రాన్‌ బీఏ.2 సబ్‌ వేరియంట్‌ కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనినే స్టెల్త్‌ ఒమిక్రాన్‌ అని పిలుస్తున్నారు. ఒరిజనల్‌ ఒమిక్రాన్ కంటే.. ఒకటిన్నర రెట్లు ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది ఈ సబ్‌ వేరియంట్‌.

ఇప్పటికే యూరప్‌, అమెరికా దేశాల్లోనూ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ మూలాల నుంచి వ్యాప్తి చెందిన స్టెల్త్‌ వేరియంట్‌.. నేరుగా మనిషి ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చిన్నారులపైనా స్టెల్త్‌ వేరియంట్.. ప్రభావం చూపుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.