అమెరికాలో కరోనా సెకండ్ వేవ్, ఆసుపత్రులన్నీ కిటకిట

  • Published By: madhu ,Published On : November 15, 2020 / 12:59 PM IST
అమెరికాలో కరోనా సెకండ్ వేవ్, ఆసుపత్రులన్నీ కిటకిట

Covid-19 America : అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ సెకండ్‌ వేవ్‌తో దేశం అతలాకుతలమవుతోంది. కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య, మరణాల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతోంది. అమెరికా ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సరిపడా వైద్య సౌకర్యాలు లేక…రోగులకు చికిత్స అందించే పరిస్థితి లేక వైద్య సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. గడచిన వారంలో కేసుల సంఖ్య 76శాతం పెరిగింది. గత నెలతో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య రెట్టింపయింది. రోజూ వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. చికాగో, సెయింట్ లూయిస్, ఓరెగాన్, న్యూ మెక్సికో సహా అనేక ప్రాంతాల్లో గవర్నర్లు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.



ప్రపంచంలో మొదటిస్థానం : –
కరోనాతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన అమెరికాను మహమ్మారి విడిచిపెట్టడం లేదు. కరోనా కేసుల్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే దేశంలో లక్షా 81 వేల 194 కేసులు నమోదయ్యాయి. వెయ్యీ 389 మంది చనిపోయారు. రెండు వారాల్లో కరోనా మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది.



వైట్ హౌజ్ లో కరోనా : –
రెండు లక్షల 51 వేల మందికిపైగా వైరస్ బారిన పడి చనిపోయారు. అమెరికాలో గత వారం, ఈ వారంతో పోలిస్తే…కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. గడచిన వారంలో రోజుకు లక్షా 40వేల 984 కేసులు నమోదయితే..ఈ వారంలో వాటి సంఖ్య లక్షా 80వేలు దాటింది. వైట్‌హౌజ్‌లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. 130మంది సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ విస్తృత వ్యాప్తిపై రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమయ్యారు.



ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : –
చికాగో, సెయింట్ లూయిస్‌లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఓరెగాన్, న్యూ మెక్సికోలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని ఆదేశించారు. లోవా, మిన్నెసోటా, న్యూ మెక్సికో, టెన్నిసె, విస్కాన్సిన్ సహా అనేక రాష్ట్రాల్లో ఈ వారం రో జుల్లో కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోయింది. సెకండ్‌వేవ్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే మహమ్మారి మరింత విజృంభిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు నాలుగు నుంచి ఆరు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు.