కరోనా కలవరం: ఇంగ్లాండ్‌‌లో రెండవసారి లాక్‌డౌన్

  • Published By: vamsi ,Published On : November 1, 2020 / 08:54 AM IST
కరోనా కలవరం: ఇంగ్లాండ్‌‌లో రెండవసారి లాక్‌డౌన్

Lockdown in England: ఐరోపా ఖండంలో కరోనా వైరస్ రెండవ తరంగంతో, చాలా దేశాలు ఇప్పుడు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఫ్రాన్స్ తరువాత, ఇప్పుడు ఇంగ్లాండ్‌లో కూడా లాక్‌డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దేశంలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ వ్యవధి నవంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

ప్రధాని జాన్సన్ ప్రకటనతో ఇంగ్లాండ్‌లో నాలుగు వారాల లాక్‌డౌన్ విధించబడుతోంది. లాక్‌డౌన్ అమల్లో భాగంగా.. పబ్బులు, రెస్టారెంట్లు, అనవసరమైన షాపులు, ఇతర సౌకర్యాల నిర్వహణపై నిషేధం ఉంటుంది. నవంబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఇంగ్లాండ్‌లో ఆంక్షలు ఉంటాయని ప్రధాని జాన్సన్ లాక్‌డౌన్ ప్రకటించారు.

అంతకుముందు గురువారం, ఫ్రాన్స్‌లో నాలుగు వారాల లాక్‌డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత, పారిస్ వీధుల్లో గందరగోళం ఏర్పడింది. వందల కిలోమీటర్లు జామ్ అయ్యాయి. క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో మ‌హ‌మ్మారిని నిలువ‌రించడానికి ఇంగ్లండ్ ప్ర‌భుత్వం చర్యలు తీసుకోగా డిసెంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. వ‌చ్చేనెల 2 త‌ర్వాత క‌రోనా నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తారు.

ఈ క్రమంలో వ‌చ్చే గురువారం నుంచి నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు సంబంధించిన దుకాణాలు మాత్ర‌మే తెరిచి ఉంటాయి. యూకేలో కొత్త‌గా 21,915 పాజిటివ్ కేసులు నమోదవగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,11,660కి చేరుకుంది. గ‌త 28 రోజుల్లో 326 మంది క‌రోనా వ‌ల్ల చ‌నిపోయారు.

ప్ర‌పంచంలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాల్లో యూకే తొమ్మిదో స్థానంలో ఉన్న‌ది. అమెరికా, భార‌త్‌, బ్రెజిల్‌, ర‌ష్యా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, అర్జెంజీనా దేశాలు యూకే కంటే ముందున్నాయి.