భారత్‌లో రష్యా Sputnik V వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

  • Published By: sreehari ,Published On : October 17, 2020 / 07:25 PM IST
భారత్‌లో రష్యా Sputnik V వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు రష్యా స్పుత్నిక్-V వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ 2/3వ దశ క్లినికల్ హ్యుమన్ ట్రయల్స్‌కు ఇండియాలో అనుమతి లభించింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF)లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతినిచ్చింది.



ప్రపంచంలోనే కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిచేసిన మొదటి దేశమైన రష్యా మూడో దశ ట్రయల్స్ భారతదేశంలో నిర్వహించనుంది. ‘ఇది మల్టీ-సెంటర్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ స్టడీ అవుతుంది. భద్రత, ఇమ్యునోజెనిసిటీ అధ్యయనంతో కూడి ఉంటుందని డాక్టర్ రెడ్డి, RDIF సంయుక్తంగా ప్రకటించాయి.



అతిపెద్ద జనాభా గల భారతదేశంలో డాక్టర్ రెడ్డీస్ రష్యా అందించే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ క్లినికల్ హ్యుమన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు DCGI పేర్కొంది. రష్యాలో ఈ వ్యాక్సిన్ నమోదు కావడానికి ముందే కొద్ది మొత్తంలో ప్రజలకు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తో టెస్టింగ్ చేసింది.



మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో 40వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. ప్రస్తుతం స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పోస్టు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉంది. ఇండియాలో వ్యాక్సిన్ పంపిణీతో పాటు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు గత సెప్టెంబర్ నెలలో డాక్టర్ రెడ్డీస్, RDIF భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ 100 మిలియన్ల డోస్‌లను సరఫరా చేయనుంది.