తీరాన్ని తాకిన తుఫాన్.. అల్లకల్లోలంగా మారిన తీరప్రాంతాలు

  • Published By: vamsi ,Published On : May 20, 2020 / 12:02 PM IST
తీరాన్ని తాకిన తుఫాన్.. అల్లకల్లోలంగా మారిన తీరప్రాంతాలు

పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య ఇవాళ(20 మే 2020) మధ్యాహ్నం 2.30 గంటలకు తీవ్ర తుఫాను ‘ఎమ్‌ఫాన్’ తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరాన్ని దాటే ప్రక్రియ నాలుగు గంటలపాటు ఉంటుందని, అనంతరం బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ వద్ద తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లో గంటకు 165 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలోని దాదాపు 4.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తుఫాన్ ప్రభావంతో బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారగా.. సముద్రంలో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అలలు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్రా తెలిపారు. బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారి, ఆ తర్వాత బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు. 39 ఎన్‌డిఆర్‌ఎఫ్ జట్లను సహాయ చర్యల కోసం పశ్చిమ బెంగాల్‌లో రిజర్వ్‌లో ఉంచారు.