Europe floods: ఐరోపాలో వరద విలయం.. 200కు చేరుకున్న మృతులు!

భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో ఐరోపా విలవిలలాడుతోంది. ముఖ్యంగా జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్​లో వరద ప్రభావం ఎక్కువగా ఉండగా.. ఈ వరదలలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు 200 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

Europe floods: ఐరోపాలో వరద విలయం.. 200కు చేరుకున్న మృతులు!

Europe Floods

Europe floods: భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో ఐరోపా విలవిలలాడుతోంది. ముఖ్యంగా జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్​లో వరద ప్రభావం ఎక్కువగా ఉండగా.. ఈ వరదలలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు 200 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల ఇళ్లు ధ్వంసం కాగా.. పెద్దసంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల బురద పేరుకుపోగా.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయా దేశాల సైన్యాలు రంగంలోకి దిగాయి.

వంద‌ల మంది వ‌ర‌ద‌నీటిలో గ‌ల్లంత‌వగా.. ఆచూకీ కోసం డిజాస్ట‌ర్ టీమ్‌, ఆర్మీ బృందాలు గాలిస్తూ మృతదేహాలను వెలికి తీస్తున్నారు. వ‌ర‌ద నీటి ప్ర‌వాహానికి అనేక ఇళ్లు కూలిపోగా.. కార్లు, ట్ర‌క్కులు కాగిత పడవల మాదిరి వ‌ర‌ద‌లో కొట్టుకుపోయాయి. వందల మంది వరదలో చిక్కుకోని ఆచూకీ లేకపోవడంతో వరదలు తగ్గిన అనంతరం మృతదేహాలు బయటపడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌కృతి సృష్టించిన ఈ వ‌ర‌దల‌తో అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.

వరదల్లో మరణించిన వారికోసం బెల్జియం మంగళవారం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించగా ఒక నిమిషం పాటు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. భారీ వర్షాలతో వరద బెల్జియం, జర్మనీలలోని పట్టణాలు, గ్రామాల గుండా ప్రవహించడంతో ప్రాణనష్టం అధికంగా జరిగింది. శనివారం నుండి వరద తగ్గడంతో సహాయక చర్యలు సాగుతున్నాయి. పేరుకుపోయిన బురదను తొలగించడంతో పాటు.. టెలిఫోన్, విద్యుత్ సౌకర్యాలను పునరుద్దరిస్తుండగా జర్మనీలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని అధ్యక్షుడు స్టెయిన్‌ మీర్‌ తెలిపారు. ఎంత నష్టం సంభవించిందో తెలియాలంటే కొన్ని వారాల సమయం పడుతుందని చెప్పారు.

బెల్జియం రాజు ఫిలిప్, రాణి మాథిల్డే ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించగా.. ఆస్ట్రియా, ఉత్తర బోహేమియాలో ఇప్పటికీ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్, చెక్‌ రిపబ్లిక్, లక్సెంబర్గ్‌లనూ వరద విలయం భయానక పరిస్థితిని తలపిస్తుంది.