భారత్ చేతికి మొదటి రాఫెల్…ఆయుధపూజ చేసిన రాజ్ నాథ్

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2019 / 01:20 PM IST
భారత్ చేతికి మొదటి రాఫెల్…ఆయుధపూజ చేసిన రాజ్ నాథ్

దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న  36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిది డసాల్ట్ ఏవియేషన్ నుండి ఇవాళ(అక్టోబర్-8,2019)అధికారికంగా భారత్ కు అందింది. భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించేందుకు రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం ఫ్రాన్స్ వెళ్లిన విషయం తెలిసిందే. మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్… ఇవాళ బోర్డియక్స్‌లోని రాఫెల్ తయారీదారు డసాల్ట్ ఏవియేషన్ ఫెసిలిటీ దగ్గర రాఫెల్ అప్పగించడాన్ని అంగీకరించారు. అధికారికంగా భారత్ కు అందిన రాఫెల్ యుద్ధ విమానానికి ఇవాళ దసరా సందర్భంగా ఆయుధపూజ నిర్వహించారు రాజ్ నాథ్. 2022 నాటికి మిగిలిన రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుకోనున్నాయి.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ….షెడ్యూల్‌ ప్రకారం రాఫెల్ ను భారత్ కు రాఫెల్ ను డెలివరీ చేయడం చాలా సంతోషం కలిగించింది. ఇది భారత వైమానిక దళానికి మరింత బలాన్ని చేకూరుస్తుందనే నమ్మకం ఉంది. భారత్-ఫ్రాన్స్  రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం అన్ని రంగాలలో మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాను. భారత్ లో ఇవాళ విజయదశమి పండుగను జరుపుకుంటున్నారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు ఈ పండుగను జరుపుకుంటాము. అంతేకాకుండా ఇవాళ భారత వైమానిక దళం 87వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. కాబట్టి ఈ రోజు చాలా విధాలుగా ప్రతీక అవుతుంది. రాఫేల్ అనేది ఫ్రెంచ్ పదం. గాలి వాయువు అని అర్ధం. విమానం దాని పేరుకు అనుగుణంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రాఫేల్ భారతదేశ వాయు ఆధిపత్యాన్ని విపరీతంగా పెంచుతుందని తాను నమ్ముతున్నానని ఆయన తెలిపారు.  రఫేల్ యుద్ధ విమానంలోరాజ్‌నాథ్ సింగ్  ప్రయాణించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి, భారతదేశానికి, ఫ్రాన్స్, డసాల్ట్ ఏవియేషన్లకు కూడా ఇది గొప్ప రోజు అని డసాల్ట్ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్ అన్నారు.కాంట్రాక్ట్ లో భాగంగా భారత్ కోసం రాఫెల్ యుద్ధ విమానాలు రెడీ చేశామని, ఇప్పుడు రాఫెల్  ఎగరడానికి సిద్ధంగా ఉందని, తాము చాలా గర్వపడుతున్నట్లు ఆయన తెలిపారు.

అంతకుముందుకు ఇవాళ ఉదయం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్‌తో రాజ్ నాథ్ సమావేశం అయ్యారు. ఆయనతో జరిపిన చర్చలు ఆత్మీయంగా, ఫలప్రదంగా జరిగాయని రాజ్‌నాథ్ తెలిపారు. రక్షణ రంగంలో ఇటీవల ఇరు దేశాల మధ్య మరింత అనుబంధం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఇద్దరూ నిర్ణయించారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడంతో పాటు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడే విధంగా గట్టి మద్దతు ఇచ్చినందుకు మేక్రాన్‌కు రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.