Corona : ప్రపంచదేశాలను వణికిస్తోన్న డెల్టా వేరియంట్..అమెరికాలో లక్షల్లో కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌, ఆస్ట్రేలియాలోనూ వైరస్‌ విజృంభిస్తోంది.

Corona : ప్రపంచదేశాలను వణికిస్తోన్న డెల్టా వేరియంట్..అమెరికాలో లక్షల్లో కేసులు

Delta Variant

Delta variant trading : ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇజ్రాయిల్‌, ఆస్ట్రేలియాలోనూ వైరస్‌ విజృంభిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతున్నప్పటికీ భారీగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కల్గించే విషయం. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే ఏకంగా 7.23 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. సుమారు 11 వేల మంది మరణించారు.

ముఖ్యంగా అమెరికాలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. వాయు వేగంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రతిరోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా కేసులు 286శాతం పెరగడం అక్కడ వైరస్‌ ఉధృతికి అద్దం పడుతోంది. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1.54 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 967 మంది మృతి చెందారు. అమెరికాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.82 లక్షలకు చేరింది.

మరణాల్లో కూడా రికార్డు స్థాయి పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన నెల రోజుల్లో కరోనా మరణాల్లో 146శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రతిరోజూ వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. అటు కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో గణణీయంగా పెరిగింది. గడిచిన రెండు వారాల్లో హాస్పిటలైజేషన్లలో 70శాతం పెరుగుదల కనిపించింది.

ఆస్ట్రేలియాను కూడా కరోనా డెల్టా వేరియంట్ వణికిస్తోంది. సిడ్నీ నుంచి వైరస్ వ్యాప్తి ఆస్ట్రేలియాలోని ఇతర ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసుగా నాలుగో రోజు 600 లకు పైగా కేసులు నమోదయ్యాయి. గతేడాది మహమ్మారి విజృంభణ తారాస్థాయిలో ఉన్నప్పుడు నమోదైన కేసుల కంటే తాజాగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అధికంగా ఉంటోందని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైరస్ ఉధృతితో సిడ్నీలో లాక్ డౌన్ పొడిగించారు. సెప్టెంబర్ చివరి వరకు ఆంక్షలు విధించారు. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, కర్ఫ్యూ లాంటి కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

మరోవైపు జపాన్ లోనూ కరోనా విజృంభిస్తోంది. గతవారం సగటున రోజుకు 20 వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. వైరస్ నియంత్రించేందుకు జపాన్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. సెప్టెంబర్ 12 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది.

రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని, షాపింగ్ మాల్స్ లో ప్రజలు గుంపులుగా ఉండకుండా చూడాలని సూచించింది. టోక్యో, ఒకినావా సహా మరో 13 ప్రాంతాలకు ఎమర్జెన్సీని విస్తరించాలని నిర్ణయించింది. మిగత ప్రాంతాల్లో పాక్షిక ఎమర్జెన్సీ విధించింది.