జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు..మాజీ పోలీస్ అధికారిని దోషిగా తేల్చిన కోర్టు

గతేడాది అమెరికాను కుదిపేసిన ఆప్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసు..మాజీ పోలీస్ అధికారిని దోషిగా తేల్చిన కోర్టు

George Floyd

George Floyd గతేడాది అమెరికాను కుదిపేసిన ఆప్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి కేసులో అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జార్డ్ ఫ్లాయిడ్‌ మృతికి మినియాపోలిస్‌ మాజీ అధికారి డెరెక్ చౌవిన్‌ కారణమని..ఆయనని దోషిగా పేర్కొంటూ మంగళవారం కోర్టు తీర్పు వెలువరించింది. 12 మంది సభ్యులున్న జ్యూరీ పది గంటల పాటు ఈ కేసును విచారించి ఈ ఘటనని ఉద్దేశ్యపూర్వకంగా చేయని సెకండ్ డిగ్రీ హత్య, థర్డ్ డిగ్రీ హత్యగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఈ కేసులో 45 మంది సాక్షులు, పోలీసు అధికారులు, వైద్య నిపుణుల వాంగ్మూలం తీసుకున్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి దోషకి త్వరలోనే శిక్ష ప్రకటిస్తామని కోర్టు తెలిపింది.

కాగా,ఈ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో కొన్ని వందల మంది నల్లజాతీయులు కోర్టు వద్దకు చేరుకున్నారు. తీర్పు వచ్చిన తర్వాత వీరంతా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లు కొడుతూ, కార్ల హారన్లు మోగిస్తూ నినాదాలు చేశారు. అమెరికా సమాజంలో తమకు జరుగుతున్న అన్యాయాలకు కోర్టులు శిక్ష విధించడం గొప్ప విషయమని పలువురు తెలిపారు. ఇక, తీర్పు వెలువడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లు జార్జ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఇది ముందడుగని బైడెన్ అన్నారు. ఈ తీర్పు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని ఫ్లాయిడ్ కుటుంబం తరఫున వాదించిన బెన్ క్రంప్ ట్వట్ చేశారు. మరోవైపు, జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగినప్పుడు డెరెక్ చౌవిన్‌ తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులపైన కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఆ ముగ్గురు పోలీసులపైన ఆగష్టు నుంచి విచారణ జరగనుంది.

కాగా, గత ఏడాది మే 25న మినియాపోలిస్‌లో నకిలీ నోట్లు సరాఫరా చేశారన్న ఆరోపణలతో జార్జ్ ఫ్లాయిడ్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ను శ్వేతజాతి పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్‌ పట్టుకొని రోడ్డుపై పడుకోబెట్టి మెడపై మోకాలితో బలంగా తొక్కిపెట్టాడు. తనకు ఊపిరి ఆడట్లేదని జార్జ్ ఫ్లాయిడ్ చెప్పినా పోలీస్ అధికారి వినిపించుకోలేదు. దీంతో ఊపిరాడకపోవడంతో జార్జ్ ఫ్లాయిడ్ కొన్ని నిమిషాల్లోనే కన్నుమూశాడు. ఈ దారుణమైన ఘటనపై అమెరికాలోని నల్లజాతీయులు తీవ్రంగా స్పందించారు. పోలీసుల జాతి వివక్ష వైఖరిపై అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది ప్రజలు రోడ్లమీదకు రావడంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఆ సమయంలో కర్ఫ్యూ కూడా విధించారు.