ఫ్యూచర్‌.. బేజార్‌ : ట్రంప్‌ భవితవ్యంపై నీలినీడలు

ఫ్యూచర్‌.. బేజార్‌ : ట్రంప్‌ భవితవ్యంపై నీలినీడలు

trump  future : పదవి చేతిలో ఉన్నంత కాలం తనకు అడ్డూఅదుపు లేన్నట్టు వ్యవహరించిన ట్రంప్‌కు ఇప్పుడు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ప్రస్తుతం ఆయనకు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సోషల్ మీడియా సంస్థల నుంచి.. తన వ్యాపార భాగస్వామ్యుల వరకు ట్రంప్‌కు మొండి చేయి చూపిస్తున్నారు.. దీంతో పదవి పోయాక వ్యాపారాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న ట్రంప్ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

సోషల్ మీడియా సంస్థలు : –
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సోష‌ల్ మీడియా సంస్థలు త‌మ ప్రతాపాన్ని కొన‌సాగిస్తున్నాయి. ట్రంప్ అకౌంట్‌ను ఇప్పటికే శాశ్వతంగా బ్యాన్ చేసింది ట్విట్టర్‌. ఇప్పుడు యూట్యూబ్ కూడా మ‌రో కొర‌డా ఝుళిపించింది. ట్రంప్ ఛాన‌ల్‌లో అప్‌లోడ్ చేసిన‌ కంటెంట్‌ను యూట్యూబ్ తీసేసింది. త‌మ విధానాల‌ను ఉల్లంఘించిన‌ట్లు కూడా యూట్యూబ్ ఆ ఛాన‌ల్‌కు వార్నింగ్ ఇచ్చింది. హింస‌ను రెచ్చగొడుతున్నట్లుగా ట్రంప్ ఛాన‌ల్ కంటెంట్ ఉందని.. అందుకే మ‌రో ఏడు రోజుల పాటు ట్రంప్ ఛాన‌ల్‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌కుండా యూట్యూబ్ చ‌ర్యలు తీసుకుంది. ట్రంప్ ఛాన‌ల్‌కు సుమారు 2 కోట్ల 77లక్షల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. అన్ని రకాల సోషల్ ప్లాట్‌ఫామ్‌ల్లో ట్రంప్‌, అతని మద్దతుదారుల అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

టిక్ టాక్ : –
ఇక తమను నిషేధించాలని తీవ్ర ప్రయత్నం చేసిన ట్రంప్‌పై టిక్‌టాక్‌ కూడా కసి తీర్చుకునేందుకు డిసైడ్‌ అయింది. కానీ ట్రంప్‌కు టిక్‌టాక్‌లో అకౌంట్‌ లేదు. దీంతో ట్రంప్ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ట్రంప్‌కు మద్దతుగా ఉన్న హ్యాష్‌ ట్యాగ్‌లను తొలగిస్తున్నామని తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగాలకు టిక్‌టాక్‌లో స్థానం లేదని ప్రకటించింది.

సిగ్నేచర్ బ్యాంకు : –
ట్రంప్‌ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక కూడా ట్రంప్‌కు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్‌ సంస్థలతో పనిచేయడం మానేయాలని ఆ సంస్థ భాగస్వామ్యులు నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అధ్యక్ష పదవి నుంచి వైదొలగక ముందే ఆయన వ్యక్తిగత బ్యాంకు ఖాతాను మూసివేస్తున్నట్లు సిగ్నేచర్‌ బ్యాంకు ప్రకటించడం సంచలనం రేపింది. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్‌ ఆస్తులకు కూడా ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.

కలిసి పనిచేసేందుకు విముఖత : –
క్యాపిటల్‌ హిల్‌ ఘటన అనంతరం ఆయన వ్యాపారాలు కూడా దెబ్బతిన్నట్టు విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు అనేక కంపెనీలు విముఖత చూపిస్తున్నాయి. ట్రంప్‌కు చెందిన న్యూజెర్సీ గోల్ఫ్ కోర్సులో పీజీఏ అమెరికా ఇకపై ఛాంపియన్‌షిప్‌లు నిర్వహించకూడదని నిర్ణయించింది. అమెరికా పెద్ద కంపెనీలు రిపబ్లికన్‌లకు విరాళాలు ఇవ్వడానికి ఇకపై నిరాకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ కుటుంబానికి దాదాపు 500 రకాల వ్యాపారాలు ఉన్నాయి. హోటళ్ళు, రిసార్టులు, మల్టీ మిలియన్ డాలర్ల గోల్ఫ్ క్లబ్‌లు ఉన్నాయి. ఇప్పుడీ వ్యాపారాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.