ముస్లిం దేశంలో కరెన్సీపై వినాయకుని బొమ్మ

  • Published By: vamsi ,Published On : August 22, 2020 / 12:07 PM IST
ముస్లిం దేశంలో కరెన్సీపై వినాయకుని బొమ్మ

గణేష్ చతుర్థి మహాపర్వ దినం నేటి నుంచి ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా ఈసారి గణపతిని దేశవ్యాప్తంగా ఇళ్లలోనే పూజిస్తున్నారు భక్తులు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు గణేష్ చతుర్థి మొదటి రోజున అందరూ పిండి వంటకాలతో సంతోషంగా జరుపుకుంటారు. భారతదేశంలో మాత్రమే కాదు.. చాలా దేశాలలో గణపతిని ఇవాళ పూజిస్తారు.



అటువంటి పరిస్థితిలో ఓ ఆసక్తికర విషయం గురించి నెట్టింట్లో చర్చ జరుగుతుంది. ఇది కొంతమందికి తెలుసు. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశంలో గణేషుడి బొమ్మను అధికారిక కరెన్సీపై ముద్రించడం అంటే మాటలు కాదు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు నివసించే దేశం ఇండోనేషియా. అలాంటి ఇండోనేషియా అధికారిక కరెన్సీపై గణేశుడి బొమ్మను ఆ దేశం ముద్రిస్తుంది.

వాస్తవానికి ఇండోనేషియా సంస్కృతి, మన దేశ సంస్కృతి కాస్త దగ్గరిగా ఉంటుంది. మన దేశంలో లాగే అక్కడ కూడా హిందూ దేవతల ఆరాధన జరుగుతుంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ, హిందూ మతం ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.



ఇండోనేషియా కరెన్సీని రూపయ్య అంటారు. ఇక్కడ 20 వేల నోటుపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఈ ముస్లిం దేశంలో గణేశుడిని విద్య, కళ మరియు విజ్ఞాన దేవుడిగా భావిస్తారు. ప్రత్యేకత ఏమిటంటే, ఇండోనేషియాలో జనాభాలో 87.5 శాతం మంది ఇస్లాం మతాన్ని విశ్వసిస్తున్నారు. ఇక్కడ హిందూ జనాభా మూడు శాతం మాత్రమే.

ఇండోనేషియాలో 20 వేల నోటులో, ముందు భాగంలో గణేశుడి చిత్రం ఉండగా, వెనుక భాగంలో తరగతి గది చిత్రం ఉంది. ఇందులో విద్యార్థి మరియు ఉపాధ్యాయుల చిత్రాలు ఉంటాయి. ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్ల క్రితం పట్టాలు తప్పింది. దాంతో 20 వేల కొత్త నోటు జారీ చేశారు. దానిపై గణేశుడి చిత్రాన్ని ముద్రించారు. ఇది ముద్రణ వెనుక ఉన్న ఆర్థిక ఆలోచనాపరులు ఇది ఆర్థిక వ్యవస్థను మళ్లీ బలోపేతం చేస్తుందని నమ్మారు. అయితే 1998 సంవత్సరంలో ఆ దేశంలో 20 వేల రూపాయల కొత్త నోట్లను ముద్రించారు. అప్పటి నుంచి గణేశుడి ఫొటోను తొలగించి.. కరెన్సీ నోటును ముద్రించడం మొదలు పెట్టారు.