అమెరికాలో మిస్టరీ విత్తనాలు..చైనా నుంచి వస్తున్నాయా ?

  • Published By: madhu ,Published On : July 30, 2020 / 07:13 AM IST
అమెరికాలో మిస్టరీ విత్తనాలు..చైనా నుంచి వస్తున్నాయా ?

చైనా – అమెరికా దేశాల మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గమనే విధంగా ఉంది. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందంటూ అమెరికా ఆ దేశంపై గుర్రుగా ఉంది. కరోనా వైరస్ కారణంగా అమెరికా గడగడలాడుతోంది. ఈ సమయంలో కొన్ని అనుమానాస్పద విత్తనాలు దేశంలోకి వస్తున్నట్లు అధికారులు గ్రహించి అలర్ట్ అయ్యారు.

చైనా నుంచి వస్తునట్లుగా భావిస్తున్నారు. వెంటనే వ్యవసాయ శాఖ అప్రమత్తమై..ఇలాంటి అనుమానాస్పద విత్తనాలు నాటొద్దని సూచించింది. అవకాశం వచ్చిన సందర్భంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటికి పని చెబుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అనుమానాస్పద విత్తనాలు వస్తుండడం గమనార్హం. ఆర్డర్ చేయకున్నా ఇంటి వద్దకు ఇలాంటి పార్సిల్స్ వస్తున్నాయని పలు ఫిర్యాదులు వస్తున్నాయి.

దాదాపు 12 రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని, మిస్టరీ విత్తన ప్యాకెట్లు వస్తున్నాయని ప్రజలు కంప్లైట్ చేస్తున్నారు. వాటిపై ఉన్న ముద్రణ బట్టి..అవి చైనా నుంచి వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఫ్లోరిడాలో ఇప్పటి వరకు 630 అనుమానాస్పద విత్తన ప్యాకెట్లు వచ్చినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ నిక్కీ ఫ్రైడ్ వెల్లడించారు.

కేసులు ఎక్కువవుతుండడంతో అనుమానాస్పద విత్తన ప్యాకెట్లపై అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. వచ్చిన పార్సిల్స్ ను ఎవరూ తెరవవద్దని, అందులో ఉన్న విత్తనాలను ఎవరూ నాటవద్దని ప్రజలకు సూచించారు.