అమెరికాలో డాక్టర్ ఘాతుకం : వైద్యురాలిని తుపాకీతో కాల్చి చంపి ఆత్మహత్య

అమెరికాలో డాక్టర్ ఘాతుకం : వైద్యురాలిని తుపాకీతో కాల్చి చంపి ఆత్మహత్య

Doctor killed woman doctor after he commits suicide : అమెరికాలో ఘోరం జరిగింది. ఓ డాక్టర్ మరో వైద్యురాలిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్‌ భరత్‌ కుమార్‌ నారుమంచి అనే భారత సంతతికి చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణుడు, మరో వైద్యురాలిని కాల్చిచంపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టెక్సస్‌ రాజధాని ఆస్టిన్‌లోని చిల్డ్రన్స్‌ మెడికల్‌ గ్రూప్‌ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. మృతురాలు కేథరిన్‌ లిండ్లే డాడ్సన్‌ కూడా చిన్నపిల్లల వైద్య నిపుణురాలే. భరత్‌కు లీలా అనే కుమార్తె ఉంది. ఆయన నుంచి భార్య దూరంగా ఉంటోంది.

డాక్టర్‌ భరత్‌కు కేథరిన్‌తో గతంలో ఏరకంగానూ పరిచయం లేకపోవడం, ఘటన జరిగిన ఆస్పత్రిలోనూ ఆయన పనిచేయలేదని పోలీసులు తెలిపారు. చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా డాక్టర్ భరత్ ఎక్కువకాలం కాలిఫోర్నియాలోనే ప్రాక్టీస్‌ చేశారు. ఇటీవల భరత్‌ కేన్సర్‌ బారినపడ్డారు. ఆయన జీవితకాలం కొన్నివారాలకే పరిమితమని వైద్యులు తేల్చారు. ఈ నేపథ్యంలో వారం క్రితం ఆయన ఆస్టిన్‌లోని చిల్డ్రన్స్‌ మెడికల్‌ గ్రూప్‌ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ తాను స్వచ్ఛందంగా పనిచేస్తానని దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ఆర్జీని ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించింది. ఆ తర్వాత రెండు పెద్ద బ్యాగులు, ఒక తుపాకీతో ఆస్పత్రిలోకి భరత్‌ ప్రవేశించారు.

ఆ సమయంలో ఆస్పత్రిలో పిల్లలు గానీ రోగులు గానీ లేరు. అక్కడి ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ భరత్ ఒక్కసారిగా తుపాకీతో బెదిరించి లిండ్లే డాడ్సన్‌ సహా మరో ఐదుగురు వైద్యులను బందీలుగా తీసుకున్నారు. బందీల్ని విడిపించేందుకు పోలీసులు వచ్చిన తర్వాత కూడా… ఆరుగంటల పాటు టెన్షన్‌ నెలకొంది. బందీలైన వైద్యుల్లో నలుగురు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

మిగిలిన ఒకే ఒక్క వైద్యురాలు లిండ్లే డాడ్సన్‌ను భరత్‌ తుపాకీతో కాల్చి చంపారు. ఆపై తనను తాను కాల్చుకొని ప్రాణాలు విడిచారు. ఆస్టిన్‌లో చిన్నపిల్లల వైద్య నిపుణురాలిగా కేథరిన్‌ లిండ్లే డాడ్సన్‌కు మంచి పేరుంది. కాగా ఇంతటి ఘాతుకానికి తమ కుమారుడు ఎందుకు పాల్పడ్డాడనేది అర్థం కావడం లేదని భరత్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.