అమెరికాలో ఎమ‌ర్జెన్సీ..‌కరోనా కట్టడికి 50 బిలియన్ డాలర్లు ప్రకటించిన ట్రంప్

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 04:25 AM IST
అమెరికాలో ఎమ‌ర్జెన్సీ..‌కరోనా కట్టడికి 50 బిలియన్ డాలర్లు ప్రకటించిన ట్రంప్

అగ్రరాజ్యం అమెరికా హెల్త్ ఎమర్జన్సీని ప్రటించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోందని..నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీని అధికారికంగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌కు 50 బిలియ‌న్ డాల‌ర్ల నిధిని కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు.

రిలీఫ్ ప్యాకేజీ గురించి ఉభ‌య‌స‌భ‌ల్లో ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు.  ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవ‌రోధాల‌ను అధిగ‌మిస్తామ‌న్నారు. కరోనా విషయంలో అత్యంత కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటున్నామని..ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో  అమెరికాకు కార్నివాల్‌, రాయ‌ల్ క‌రేబియ‌న్‌, నార్వేయ‌న్‌, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌ల‌ను 30 రోజుల పాటు నిలిపేసిన‌ట్లు ట్రంప్ తెలిపారు. 

అమెరికా ప్ర‌జ‌లు ఎక్క‌డ ఉన్నా.. ప్రజల ఆరోగ్యం కోసం ప్రార్థ‌న‌లు చేయాల‌ని ఈ సందర్భంగా ట్రంప్ కోరారు.  అందరి సహకారంతో కరోనా వైర‌స్‌ను కట్టడి చేద్దామని అన్నారు. దీంట్లో భాగంగా మార్చి 15వ తేదీన నేష‌న‌ల్ ప్రేయ‌ర్ డేగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.  ఆపద సమయాల్లోను..విప‌త్క‌ర స‌మ‌యాల్లో  ర‌క్ష‌ణ కోసం దేవుడ్ని ప్రార్థించే  చ‌రిత్ర అమెరికాకు ఉన్న‌ద‌ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఎమ‌ర్జెన్సీ సేవ‌లు మ‌రింత త్వ‌ర‌గా అందేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అమెరికా ప్ర‌జ‌ల స్పూర్తి, ప‌ట్టుద‌ల చాలా బ‌ల‌మైన‌వ‌ని,ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అమెరికన్లు ఉందని ప్రజల్లో స్థైర్యాన్ని నింపారు ట్రంప్.

Also Read | ఏపీలో మినీ హెల్త్ ఎమర్జెన్సీ: 1897 చట్టం అమల్లోకి!