ముగిసిన ట్రంప్ శకం : 20న బైడెన్ అధ్యక్ష బాధ్యతలు

ముగిసిన ట్రంప్ శకం : 20న బైడెన్ అధ్యక్ష బాధ్యతలు

Donald Trump impeachment : అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ శకం ముగిసిపోయింది. మరో వారం రోజుల్లో అధికారానికి దూరం కానున్న ట్రంప్… అభిశంసనకు గురయ్యాడు. ట్రంప్‌పై డెమొక్రాట్లు పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. మొత్తం 232 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. అందులో పదిమంది రిపబ్లికన్లు కూడా ఉన్నారు. దీంతో.. అమెరికా చరిత్రలో రెండోసారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డ్ క్రియేట్ చేశాడు. జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరిస్తూ ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పెద్దఎత్తున్న క్యాపిటల్‌ భవనాన్ని చుట్టముట్టారు.

దీంతో పోలీసులకు, ట్రంప్‌ మద్దతుదారులకు మధ్య ఘర్షణలో జరిగింది. ఈ గొడవలో ఐదుగురు చనిపోయారు. అయితే ట్రంప్‌ తన మద్దతుదారులను రెచ్చగొట్టడం వల్లే ఘర్షణ జరిగిందంటూ డెమొక్రాట్లు ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టారు. దీనికి మెజారిటీ సభ్యులు మద్దతు ఇవ్వడంతో ట్రంప్‌ అభిశంసనకు గురయ్యారు. ఇక ఈ తీర్మానాన్ని సెనెట్‌కు పంపిస్తారు. జనవరి 20న బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత ట్రంప్‌పై విచారణ జరగనుంది. ముందుగా 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ తీర్మానాన్ని రిపబ్లికన్లు అడ్డుకున్నారు. 25 సవరణ అధికారాన్ని ఉపయోగించేందుకు తాను సుముఖంగా లేనంటూ ఉపాధ్యక్షుడు పెన్స్‌ ఇదివరకే సంకేతాలిచ్చారు. అయినా సరే స్పీకర్‌ పెలోసీ పట్టుబట్టి మరీ ఈ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు. అయితే తీర్మానాన్ని ఉపాధ్యక్షుడు పెన్స్‌ తోసిపుచ్చారు. దీంతో ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు సోమవారం ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో చర్చ సాగింది. ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని పలువురు సభ్యులు ఓటేయడంతో అభిశంసనకు గురయ్యాడు. దీనికి ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లిక్‌ సభ్యులు సైతం కొందరు మద్దతు తెలిపారు.