అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం ఇదే

అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయం ఇదే

Donald Trump అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరికొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ అధ్యక్షుడు కాబోతున్నారు. అధికారాల బదిలీ ప్రక్రియ సమయంలోనూ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రంప్.. అధ్యక్షుడిగా ఉన్న చివరి రోజు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. ఈ జాబితాలో ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బాన‌న్ కూడా ఉన్నారు.

2016 ఎన్నిక‌ల సమయంలో స్టీవ్ బ్యాన‌న్‌.. ట్రంప్‌కు వ్యూహకర్తగా వ్యవహరించారు. అయితే గ‌త ఏడాది ఆగ‌స్టులో ఆయనను అరెస్ట్ చేశారు. మెక్సికో స‌రిహ‌ద్దు గోడ నిర్మాణం కోసం జ‌రిగిన నిధుల సేక‌ర‌ణ‌లో స్టీవ్ బాన‌న్ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. వీ బిల్డ్ ద వాల్ క్యాంపేన్ ద్వారా సుమారు 25 మిలియ‌న్ల డాల‌ర్లు సేకించారు. అందులో దాదాపు మిలియ‌న్ డాల‌ర్లను బాన‌న్ వెనకేసుకున్నట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ బ్యానన్‌ వీటిని ఖండించారు.

బ్యానన్ చాలా ముఖ్యమైన నాయకుడని, ఆయనకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్న ట్రంప్ అతడికి క్షమాభిక్ష పెట్టారు. మరోవైపు లిల్ వెయిన్, కోడక్ బ్లాక్ అక్రమ ఆయుధాలు కలిగివున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. క్విల్‌పాట్రిక్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీరందరికి ట్రంప్‌ క్షమాభిక్ష పెట్టారు. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికాలో అధ్యక్షులు చాలా మందికి క్షమాభిక్ష పెడుతుంటారు. కొన్ని నెలలుగా ట్రంప్ కూడా చాలా మందికి వరుసగా క్షమాభిక్ష పెడుతూ వచ్చారు. సన్నిహితులతోపాటు తనతో కలిసి పనిచేసిన పాల్ మెనాఫోర్ట్ లాంటి వారు కూడా క్షమాభిక్ష పొందినవారిలో ఉన్నారు.

ర్యాపర్ లిల్ వెయిన్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనకు ట్రంప్ ఆమోదం తెలిపారు. మరో ర్యాపర్ కోడక్ బ్లాక్, డెట్రాయిట్ మాజీ మేయర్ క్వేమ్ కిల్‌పాట్రిక్‌ల శిక్షలను కూడా తగ్గించారు. మొత్తంగా 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారని, మరో 70 మందికి శిక్షలు తగ్గించారని వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.