వైట్ హౌస్ లో దీపావళి వేడుకల్లో ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : November 15, 2020 / 04:10 PM IST
వైట్ హౌస్ లో దీపావళి వేడుకల్లో ట్రంప్

Donald Trump Lights A Diya At The White House On Diwali, Extends Wishes అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు జరిగాయి. వైట్‌ హౌస్‌ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మెలానియా ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా దీపం వెలిగించి దీపావళి పండుగ జరుపుకుంటున్నవారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.



ఈ కార్యక్రమంలో వైట్ హౌస్ సిబ్బందితోపాటు పలువురు భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా చాలా నమ్మకమైన దేశమని, ప్రతి ఒక్క అమెరికన్‌ రాజ్యాంగబద్దంగా స్వేచ్ఛగా జీవించేలా తన పాలన కొనసాగినందుకు గర్విస్తున్నానని తెలిపారు. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటామని గుర్తుచేశారు.



దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దీపావళి కాంతుల్లా.. అమెరికా ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని, ప్రజలంతా మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షించారు. తాను దీపావళిలో పాల్గొన్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు ట్రంప్. కాగా, భారతీయుల ప్రముఖ పండుగ అయిన దీపావళిని వైట్ హౌస్ లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.



కాగా, దీపావళి పండుగను పురస్కరించుకుని భారతీయులకు ప్రపంచ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా త‌దుప‌రి అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. కొత్త ‌సంవ‌త్స‌రంలో అంద‌రి జీవితాల్లో ఆనందం, శ్రేయ‌స్సు నిండి ఉండాల‌ని ఆకాంక్షించారు.