బంకర్లో దాక్కున్న Trump, ఎగసిపడుతున్న ఆందోళనలు

  • Published By: Subhan ,Published On : June 1, 2020 / 04:47 AM IST
బంకర్లో దాక్కున్న Trump, ఎగసిపడుతున్న ఆందోళనలు

అగ్రరాజ్యం అమెరికాలో ఆఫ్రికన్ల ఆందోళనలు రెట్టింపు అవుతున్నాయి. దేశాధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వరకూ వ్యాపించాయి. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ భయంతో బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఒక్కడే కాదు.. పరిస్థితి అదుపు తప్పుతుందేమోనన్న భయంతో అతని ఫ్యామిలీ మొత్తాన్ని బంకర్‌కు షిఫ్ట్ చేశారు. మరోవైపు హింసాకాండ మరిన్ని రాష్ర్టాలు, నగరాలకు విస్తరించింది. 

పోలీసులకు తోడు నేషనల్‌ గార్డ్స్‌ కూడా రంగంలోకి దిగినప్పటికీ తగ్గటంలేదు. వేలమంది నిరసకారులు రోడ్లు, పబ్లిక్‌ పార్కుల్లో గుమిగూడి న్యాయం కావాలంటూ నినదిస్తున్నారు. ‘నాకు ఊపిరి ఆడటంలేదు.. మీ చర్యలతో మేం విసిగిపోయాం అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. అల్లర్లను అదుపుచేసేందుకు న్యూయార్క్‌, మిన్నెపొలిస్‌ లాంటి డజనుకుపైగా దళాలు పనిచేస్తున్నాయి. నగరాల్లో రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేలమంది నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించారు.  

ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్‌ ఫ్లాయిడ్‌ సోమవారం పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అప్పటినుంచి నిరసనలు హోరెత్తాయి. మొదట మినియాపోలీస్‌లో మొదలైన ఆందోళనలు చూస్తుండగానే అన్ని ప్రధాన నగరాలకు పాకాయి. దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ గేటు దగ్గర డస్ట్‌బిన్‌కు నిప్పు పెట్టారు. నిరసనలకు కేంద్రమైన మిన్నెపొలిస్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు నగరంలో పదివేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను రంగంలోకి దించారు. ఫిలడేల్ఫియాలో నాలుగు పోలీస్‌ వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో 13 మంది పోలీసులు గాయపడ్డారు. 

న్యూయార్క్‌, అట్లాంటా, డెనోవర్‌, లాస్‌ఎంజిల్స్‌, మిన్నెపొలిస్‌, ఆన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్‌ నగరాల్లో రాత్రి 8 గంటల తర్వాత కర్ఫ్యూ విధించారు. 22 నగరాల్లో ఇప్పటివరకు 1669 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకవైపు దేశమంతా భగ్గుమంటున్నా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఫ్లోరిడాలో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ప్రయోగాన్ని తిలకించటంలోనే గడిపారు. హింసాత్మక నిరసనలను డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ ఖండించారు. 

నిరసనలు కొన్నిచోట్ల హింసాత్మకంగా మారినప్పటికీ చాలా ప్రాంతాల్లో వేలమంది శాంతియుతంగా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. వాషింగ్టన్‌ డీసీలో దాదాపు వెయ్యిమంది ఆఫ్రికన్ అమెరికన్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల హింసకు అంతులేకుండా పోయిందని మండిపడ్డారు. పోలీసుల దాష్టీకానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు పదేపదే ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

అమెరికాలో రోజురోజుకి కరోనా ఉధృతం రూపం దాల్చుతోంది. మాస్క్ ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఆల్లర్లు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తున్నాయి. నిరసనలో పాల్గొన్న ఓల్గాహాల్‌ అనే మహిళ ఆవేదన వ్యక్తంచేశారు. ‘జరుగుతున్న పొరపాట్లు నిజానికి పొరపాట్లు కావు. వారు (పోలీసులు) పదేపదే ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. నల్లజాతీయుల హత్యలను ఇప్పటికైనా ఆపాలని అన్నివర్గాల ప్రజలు నినదిస్తున్నారు’ అని బ్రూక్లిన్‌లో నిరసనల్లో పాల్గొన్న మెరిల్‌ మకిల్‌స్కీ అన్నారు. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న అలస్కా రాష్ట్రంలో ఆదివారం నిరసన ప్రదర్శనల్లో పోలీసులు కూడా పాల్గొన్నారు. పోలీసుల అతి హింసను అనుమతించేదిలేదని జునావ్‌ నగర పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఎడ్‌ మెర్సెర్‌ స్పష్టంచేశారు. 

Read: కరోనాకి దూరంగా : సోషల్ డిస్టెన్సింగ్ ‘షూ’