న్యాయ పోరాటం చేస్తానంటున్న ట్రంప్

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 09:42 AM IST
న్యాయ పోరాటం చేస్తానంటున్న ట్రంప్

Donald Trump’s legal war : అమెరికాలో కొత్త పొద్దు పొడిచింది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. బైడెన్‌కు ఇప్పటివరకు 290 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షురాలిగా ఇండో ఆఫ్రికన్‌ మూలాలున్న కమలా హారిస్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. అటు బైడెన్‌ గెలుపును ఏ రాష్ట్రం కూడా అధికారంగా ప్రకటించలేదన్నారు ట్రంప్. సోమవారం నుంచి న్యాయపోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.



జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్ : –
జో బైడెన్‌ గెలుపును ఇంకా ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. టీవీ చానళ్లు ప్రకటించిన నెంబర్లను చూసి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి జో బైడెన్ ఆరాటపడుతున్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఎన్నికల కౌంటింగ్‌ తీరుపై న్యాయపోరాటం ఉధృతం చేస్తామన్నారు. అమెరికా ప్రజలు నిజాయితిగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నారన్నారు.



బైడెన్ కు 290 ఎలక్టోరల్ ఓట్లు : –
ఇక ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు జో బైడెన్‌. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు రాగానే ఆయన గెలిచినట్టు అధికారంగా ప్రకటించారు. నెవెడాలోనూ ఆరు ఎలక్టోరల్ ఓట్లు రావడంతో 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు బైడెన్‌. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు.



గెలుపుపై స్పందించిన బైడెన్ : –
తన గెలుపుపై జో బైడెన్ స్పందించారు. అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేట్ కంట్రీకి లీడర్‌గా ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. మనముందున్న పని కష్టమైందే. కానీ, నేను అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిని. మీరు నాకు ఓటు వేసినా. వేయకపోయినా. మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ ట్వీట్ చేశారు బైడెన్‌.



చేయాల్సి ఎంతో ఉంది : –
జో బైడెన్‌తో కమలా హారిస్‌ ఫోన్‌లో విజయానందాన్ని పంచుకున్నారు. మనం సాధించాం.. మీరు తదుపరి అధ్యక్షుడు అవుతున్నారు అంటూ ఆనందం వ్యక్తంచేశారు. జో బైడెన్‌ విజయం ఆమెరికన్ల ఆత్మకు సంబంధించినదని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. అమెరికాకు చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ‘ఏ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఆల్‌ అమెరికన్స్‌’ అంటూ ఓ వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ అమెరికాకు మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు.



అమెరికా ఆత్మ కోసమే ఎన్నికలు : –
భారతీయ మూలాలున్న కమలా హారిస్ అమెరికా ఉపాధక్షురాలిగా వైట్‌ హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపు ఖాయమైన తర్వాత కమలాహారిస్ స్పందించారు. ఈ ఎన్నికలు కేవలం జో బైడెన్ గురించో లేక తన గురించో కాదని.. ఇది అమెరికా అత్మ కోసమన్నారు. ఇక ముందూ చాలా పని ఉందంటూ ట్వీట్ చేశారు.