గడువుకి ముందే ట్రంప్ పై వేటు!

గడువుకి ముందే ట్రంప్ పై వేటు!

Donald Trump’s supporters storm capitol: Can he be removed before 20th January? క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అమెరికాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గడువుకు ముందే ట్రంప్‌ను అధ్యక్ష పీఠం నుంచి దింపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ ఈలోగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్‌ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్‌ (అమెరికా పార్లమెంట్) పరిశీలిస్తోంది. గురువారం నాలుగు గంటల హింసాత్మక ఘటనల తర్వాత యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పీఠం నుంచి అభిశంసన ద్వారా తొలగించే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించినట్టు అమెరికా మీడియా పేర్కొంది. క్యాబినెట్ భేటీలో రాజ్యాంగంలోని 25వ సవరణపై సభ్యులు దృష్టి సారించారు.

అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణలో నాలుగు సెక్షన్లు ఉన్నాయి.

అధ్యక్షుడు పదవిలో ఉండగానే మరణిస్తే దీనిలో మొదటి సెక్షన్‌ ద్వారా ఉపాధ్యక్షుడు పదవి బాధ్యతలు చేపడతారు. రెండో సెక్షన్‌.. ఉపాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి సంబంధించినది, మూడోది.. అధ్యక్షుడెవరైనా తనంతట తానుగా పదవిలో కొనసాగలేనని, తప్పుకుంటానని చెప్పినప్పుడు ఉపాధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించడానికి వినియోగిస్తారు. ఇక అధ్యక్షుడు పాలనా వ్యవస్థపై నియంత్రణ కోల్పోతే ఉపాధ్యక్షుడు, కేబినెట్‌ సభ్యుల ఆమోదంతో నాలుగో సెక్షన్‌ ద్వారా అధ్యక్షుడిని తొలగించవచ్చు.

అయితే, ట్రంప్‌ని అభిశంసన ద్వారా కూడా పదవి నుంచి తొలగించవచ్చు. అయితే ఇది ప్రతినిధుల సభ ద్వారా జరగాలి. మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్‌ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఒకే రోజులో ఈ ప్రక్రియని ముగించేలా వెసులుబాటు ఉంది. గత ఏడాది ట్రంప్‌పై అభిసంశన తీర్మానం పెట్టినా సెనేట్‌లో వీగిపోయిన విషయం తెలిసిందే.

ట్రంప్‌ను తొలగించాలని కోరుతూ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు డెమొక్రాట్స్ జ్యుడీషియరీ కమిటీ కూడా ఓ లేఖ రాసింది. ఆయన తిరుగుబాటు చర్యకు ప్రేరేపించారని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. అటు, సొంత పార్టీ నేతల వైపు నుంచి కూడా ట్రంప్ వ్యతిరేఖత ఎదుర్కొంటున్నారు. అధికార బదిలీపై కాంగ్రెస్ సమావేశం జరుగుతున్న సమయంలో క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి చేయడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ట్రంప్ పట్టు కోల్పోయారని రిపబ్లికన్ నేతలే వ్యాఖ్యానించినట్లు పలు అమెరికన్ మీడియా ఛానళ్లు తెలిపాయి. మొత్తానికి పదవీకాలం ముగియడానికి ముందు ట్రంప్ విపరీత చర్యలకు పాల్పడుతూ భంగపాటుకి గురవుతున్నారు.