వ్యాక్సిన్ డెలివరీలో ఆలస్యం..ఆస్ట్రాజెనికాపై కేసు వేసిన ఈయూ

వ్యాక్సిన్ డెలివరీలో ఆలస్యం..ఆస్ట్రాజెనికాపై కేసు వేసిన ఈయూ

Eu Sues Astrazeneca For Breach Of Vaccine Delivery Contract

EU sues AstraZeneca కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీలో లోపాల కారణంగా ఆస్ట్రాజెనికా కంపెనీపై యూరోపియన్ యూనియన్(ఈయూ) కేసు వేసింది. అంగీకరించిన వ్యాక్సిన్ డోసులను సమయానికి అందించలేదనే కారణంతో ఆస్ట్రాజెనెకా కంపెనీపై కేసు వేసింది.

ఆస్ట్రాజెనికాతో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఈరోపియన్ యూనియన్ ఒప్పందం చేసుకుంది. అయితే ఒప్పందంలోని కొన్ని నిబంధనలను ఆస్ట్రాజెనికా కంపెనీ గౌరవించలేదు. వ్యాక్సిన్ డెలివరీలో లోపాలను కంపెనీ అధిగమించలేదు, వాటిని అధిగమించే ప్రణాళిక కూడా నిర్ణయించలేదు అని ఈయూ ప్రతినిధి స్టీఫెన్ డీ కీర్స్మాకర్ తెలిపారు. నూతన కొనుగోలు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రాతిపదికన ఆస్ట్రాజెనికాపై చట్టబద్దమైన చర్యలకు దిగామని,యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 సభ్య దేశాలు ఈ చర్యకు మద్దతు ఇచ్చాయని సోమవారం స్టీఫెన్ అన్నారు.

కాగా,ఆస్ట్రాజెనికా-ఈయూ మధ్య గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం..ఈ ఏడాది రెండో క్వార్టర్ లో 18కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ఆస్ట్రాజెనికా కంపెనీ ఈయూ దేశాలకు డెలివరీ చేయాల్సి ఉంది. అయితే మార్చి 12 న ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో.. జూన్ చివరి నాటికి 10 కోట్ల వ్యాక్సిన్లను మరియు రెండవ క్వార్టర్ లో 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను మాత్రమే పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

అయితే, తాజాగా ఈయూ చేసిన ఆరోపణలను ఆస్ట్రాజెనెకా ఖండించింది. ఈయూ తీసుకున్న ఈ లీగల్ చర్య ప్రయోజనం లేనిదని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. సంస్థ కొనుగోలు ఒప్పందానికి కట్టుబడి ఉందని తెలిపింది. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఈ అవకాశాన్ని తాము స్వాగతిస్తున్నాము అని కంపెనీ తెలిపింది. ఆస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాస్కల్ సోరియోట్ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్‌తో తన కంపెనీ ఒప్పందం “ఉత్తమమైన సహేతుకమైన ప్రయత్నాలు” నిబంధనతో మాత్రమే ముడిపడి ఉందని వాదించారు.