లక్షణాలు లేకుండానే వ్యాప్తి : కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 04:54 AM IST
లక్షణాలు లేకుండానే వ్యాప్తి : కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్

ప్రాణాంతక కరోనా వైరస్(coronavirus).. చైనానే కాదు ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా దెబ్బకు అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. మరణాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే కరోనా వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. మనుషుల నుంచి మనుషులకు వచ్చే ఈ వ్యాధి.. దగ్గు, తుమ్ములు, షేక్ హ్యాండ్ వంటి చర్యలతోనే ఎక్కువగా వ్యాపిస్తోంది.

జలుబు, జ్వరం, దగ్గు:
కరోనా వైరస్ సోకిందా లేదా అని తెలసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వైరస్ సోకగానే ముందుగా జలుబు వస్తుంది. తుమ్మడం, దగ్గడం, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఇక్కడితో ఆగకుండా ఊపిరితిత్తుల వరకూ చేరుతుంది. న్యూమోనియాకి దారి తీస్తుంది. ఇది ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్షణాలు లేకుండానే వ్యాప్తి:
కాగా, తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకింది లేనిది..లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని అంతా అనుకున్నారు. కానీ.. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాపిస్తుంది అనే నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో సైంటిస్టులు, డాక్టర్లు షాక్ అయ్యారు. ఆందోళనలో పడిపోయారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని చైనా డాక్టర్లు చెప్పినట్టు.. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో కథనం వచ్చింది.

జర్మనీకి వెళ్లి వచ్చాక అస్వస్థత:
ఈ తరహా కేసు జర్మనీ నుంచి నమోదైంది. చైనాకి చెందిన ఓ మహిళ షాంఘై(shanghai) నుంచి జర్మనీలోని బవేరియా(bavaria) వెళ్లింది. నాలుగు రోజుల ట్రిప్. వెళ్లేటప్పుడు ఆమె హెల్తీగానే ఉంది. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. చైనాకి తిరిగి వచ్చాక ఆమె అస్వస్థతకు గురైంది. ఆమె నడుము నొప్పితో బాధపడుతోంది. వెంటనే అధికారులు ఆమెని చికిత్స నిమత్తం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెని టెస్ట్ చేస్తున్నారు. కరోనా వైరస్ సోకిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. రిపోర్టులు వచ్చాకే నిర్ధారణకు వస్తామన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ, ఇన్ ఫెక్షస్ డిసిజ్ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనీ చెప్పారు.

జర్మనీ నుంచి వచ్చాక నడుం నొప్పి:
జర్మనీ(germany) నుంచి చైనా వచ్చిన బాధితురాలు బిజినెస్ ఉమెన్. జర్మనీ నుంచి చైనాలో ల్యాండ్ అయిన వెంటనే.. తనకు గొంతు నొప్పి, చలి, కండరాల నొప్పులు వచ్చాయని చెప్పింది. మరుసటి రోజు 102.4 డిగ్రీల జ్వరం వచ్చిందన్నారు. జనవరి 20, 21 న మ్యూనిచ్‌లో చైనా వ్యాపార భాగస్వామిని కలిసినట్టు ఆమె చెప్పింది. ఆమె షాంఘై నివాసి. జనవరి 19 నుండి జనవరి 22 వరకు జర్మనీలో ఉంది. చైనా నుంచి వెళ్లే సమయంలో ఆమె ఆరోగ్యంగానే ఉంది. చైనాకు తిరిగి చేరే సమయానికి అనారోగ్యానికి గురైంది. ఇప్పుడీ కేసు సంచలనంగా మారింది. సైంటిస్టులు, డాక్టర్లను ఆందోళనలో పడేసింది. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అనేది నిజమే అయితే.. ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని, మరింత ప్రమాదంలో పడినట్టే అని డాక్టర్లు చెప్పారు.

28 రోజుల్లోనే మరణం:
కాగా, కరోనా వైరస్ కు ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వ్యాధి సోకిన వారికి రోజురోజుకి మరణానికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. దీంతో పాటు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా ప్రాణాలు కోల్పోతారు. కరోనా వైరస్ సోకిన వారిలో.. చాలా మంది 28 రోజుల్లోనే మరణించారు. ఒకవేళ ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఇంకా ముందుగానే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.