ఏది నిజం: బంగ్లాదేశ్ టకా కంటే భారత రూపాయి విలువ పడిపోయిందా?

  • Published By: vamsi ,Published On : August 29, 2019 / 08:20 AM IST
ఏది నిజం: బంగ్లాదేశ్ టకా కంటే భారత రూపాయి విలువ పడిపోయిందా?

సోషల్ మీడియా అంటే అసత్య ప్రచారాలకు కొదవేం లేదు. పలానా విషయం పోస్ట్ చేయకూడదన్న నియమ నిబంధనలు ఏమీ లేకపోవడం.. కాస్త ఫొటోషాప్ తెలిసి, నాలుగు అక్షరాలు రాసే జ్ఞానం ఉంటే చాలు. కామన్‌సెన్స్ లేకపోయినా కాంట్రవర్శీలు, అసత్య వార్తలను క్రియేట్ చేసేస్తారు. అనైతిక ప్రచారాలు, వ్యక్తిగత సోషల్ దాడులు ఇటీవలికాలంలో పెరిగిపోయాయి. నియంత్రణ లేని సోషల్ మీడియాలో ఇటీవల ఫేక్ ప్రచారాలు పీక్ లో జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా  భారత రూపాయి విలువపై సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఆ విషయం ఏంటంటే బంగ్లాదేశ్ కరెన్సీ ‘టకా’తో పోలిస్తే భారత ‘రూపాయి’ విలువ బాగా పడిపోయిందనే వార్త. దీనికి సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 72 ఏళ్లలో మొదటిసారి భారత రూపాయి విలువ బంగ్లాదేశ్ ‘టకా’ కంటే దిగిపోయిందనే వార్తలు వైరల్ గా మారాయి. 

అంతేకాదు.. ఈ పరిస్థితికి ప్రధాని మోడీ కారణం అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో కరెన్సీ రేట్, రూపాయి-టకాను పోలుస్తూ చాలా మంది గ్రాఫ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ వార్త పూర్తిగా అవాస్తవం. బంగ్లాదేశ్, భారత్ స్టాక్ ఎక్ఛేంజిల నుంచి లభించిన వివరాల ప్రకారం, టకా-రూపాయి కన్వర్షన్ రేట్ చూపిస్తున్న కొన్ని వెబ్‌సైట్స్ చెబుతున్న దాని ప్రకారం మంగళవారం, ఒక భారత రూపాయితో పోలిస్తే బంగ్లాదేశ్ టకా విలువ 1.18 టకాగా ఉంది.

అంటే ఒక భారత రూపాయికి 1.18 బంగ్లాదేశ్ టకాలు వస్తాయనమాట. రూ.10 విలువ 11.80 బంగ్లాదేశీ టకాలు. దీనినే తిరగేసి చూస్తే బంగ్లాదేశీ టకాకు 85 పైసలు(రూపాయిలో) మాత్రమే వస్తాయి. అంటే పది బంగ్లాదేశ్ టకాల విలువ 8.50 రూపాయలు మాత్రమే. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. ఒక బంగ్లాదేశీ టకా కొనాలంటే మన కరెన్సీలో 85 పైసలు చెల్లిస్తే చాలు. సోషల్ మీడియాలో జనం రివర్స్ కన్వర్షన్ రేట్ ఉన్న ఈ గ్రాఫ్‌నే పోస్ట్ చేస్తున్నారు. ఒక బంగ్లాదేశ్ టకాకు 0.85 భారత రూపాయి ఉండడంతో విదేశీ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి బలహీనపడిందని చెబుతున్నారు.

ఇక బంగ్లాదేశ్ లోని ఢాకా స్టాక్ ఎక్ఛేంజ్, చిట్టగాంగ్ స్టాక్ ఎక్ఛేంజ్ వివరాల ప్రకారం గురువారం(29 ఆగస్ట్ 2019) ఒక అమెరికా డాలర్ విలువ 84.55 బంగ్లాదేశ్ టకాలకు సమానంగా ఉంది. మరోవైపు భారత నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ ప్రకారం ఒక అమెరికా డాలర్ విలువ 71.81  రూపాయలుగా ఉంది. అంటే డాలరుకు బంగ్లాదేశ్ టకాతో పోలిస్తే రూపాయే మెరుగ్గా ఉంది.

గత పదేళ్లలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ కంటే బంగ్లాదేశ్ కరెన్సీ స్థితి కాస్త మెరుగుపడినా కూడా రూపాయి రేటును మాత్రం దాటిపోయే పరిస్థితి లేదు. ఇప్పట్లో అది సాధ్యం అయ్యే అవకాశం కూడా లేదు. ఇటువంటి తప్పుడు వార్తలకు స్వీయ నియంత్రణ తప్ప మరొక మార్గం లేదు అంటున్నారు విశ్లేషకులు.