Body Double Leaders : ప్రముఖ నేతల ‘బాడీ డబుల్ మిస్టరీ’లు.. క్వీన్ ఎలిజబెత్ నుంచి ఉత్తరకొరియా నియంత కిమ్ వరకు..

చరిత్రలో బాడీ డబుల్ మిస్టరీలు చాలానే ఉన్నాయ్. జోసెఫ్ స్టాలిన్, సద్దాం హుస్సేన్, కిమ్ జోంగ్ ఉన్, క్వీన్ ఎలిజబెత్ కూడా బాడీ డబుల్స్‌ని ఉపయోగించారనే ప్రచారం ఇప్పటికీ నడుస్తోంది. పుతిన్ అంటే.. అనారోగ్య కారణాలతో.. బాడీ డబుల్‌ని వాడుతున్నారనుకుందాం. మరి.. వాళ్లంతా ఎందుకు బాడీ డబుల్‌ని వినియోగించాల్సి వచ్చింది...? కారణాలేంటీ..?

Body Double Leaders : ప్రముఖ నేతల ‘బాడీ డబుల్ మిస్టరీ’లు.. క్వీన్ ఎలిజబెత్ నుంచి ఉత్తరకొరియా నియంత కిమ్ వరకు..

Body Double Leders In history

Body Double Leders In history : ఒక్క పుతిన్ మాత్రమే కాదు.. హిస్టరీలో.. ఇలాంటి బాడీ డబుల్ మిస్టరీలు చాలానే ఉన్నాయ్. జోసెఫ్ స్టాలిన్, సద్దాం హుస్సేన్, కిమ్ జోంగ్ ఉన్, క్వీన్ ఎలిజబెత్ కూడా బాడీ డబుల్స్‌ని ఉపయోగించారనే ప్రచారం ఇప్పటికీ నడుస్తోంది. పుతిన్ అంటే.. అనారోగ్య కారణాలతో.. బాడీ డబుల్‌ని వాడుతున్నారనుకుందాం. మరి.. వాళ్లంతా ఎందుకు బాడీ డబుల్‌ని వినియోగించాల్సి వచ్చింది.

దేశాధినేతలు, ప్రముఖ రాజకీయ నాయకులు.. కొన్నేళ్లుగా తమ నకిలీలను తెరపైకి తెచ్చారు. ప్రజా జీవితంలో వారు ఎదుర్కొనే ప్రమాదాన్ని తగ్గించడానికి.. ఇదో సీక్రెట్ మిషన్. ప్రపంచవ్యాప్తంగా.. అనేక రాజకీయ నేతల హత్యలు జరిగాయ్. కొద్ది నెలల క్రితమే.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను.. పబ్లిక్ మీటింగ్‌లోనే హత్య చేశారు. అలాంటి వాటి నుంచి తప్పించుకోవడంతో పాటు మరెన్నో వ్యూహాత్మక మిషన్ల కోసం ఈ కాన్సెప్ట్‌ని ఫాలో అవుతుంటారు. సెలబ్రిటీలు, అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల కదలికల గురించి.. ప్రజలను, శత్రువులను గందరగోళానికి గురిచేసేందుకు.. బాడీ డబుల్స్ సహాయపడతాయ్.

బాడీ డబుల్ కోసం ఎంపిక చేయబడిన వ్యక్తులకు.. అతను ఎవరి కోసమైతే ఎంపిక చేశారో.. అతనికి సరిపోలేలా తయారుచేస్తారు. ప్లాస్టిక్ సర్జరీల ద్వారా.. వారి రూపాన్ని ఏమాత్రం అనుమానం రాకుండా మార్చేస్తారు. వారి కదలికలు, మాట తీరు, ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఒకేలా ఉంటాయ్. ఇందుకోసం.. అన్ని విధాలా ట్రైనింగ్ ఇస్తారు. అలా.. చరిత్రలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు.. తమ స్థానంలో.. తమ పోలికలతో ఉన్న ఇతర వ్యక్తులను ఉపయోగించి.. తమ వ్యూహాలను అమలు చేశారు. ఈ లిస్టులో.. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తర్వాత.. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.

Also read : Putin Body Double : పుతిన్ ఒరిజినలా?నకిలీయా?రష్యా అధ్యక్షుడు ‘బాడీ డబుల్’వెనకున్న మిస్టరీ ఏంటి?

ఉత్తర కొరియా నియంత.. కిమ్ జోంగ్ ఉన్.. అణ్వాయుధాలతో ప్రపంచాన్ని బెదిరిస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఆ మధ్యకాలంలో.. అతనికి సంబంధించిన ఓ వీడియో బయటకి వచ్చినప్పుడు.. దానిపై పెద్ద చర్చే జరిగింది. అందులో ఉన్నది రియల్ కిమ్ కాదని.. అది అతని డూప్‌ అంటూ ప్రచారం జరిగింది. పుతిన్ ఆరోగ్యం విషయంలో.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం లాగే.. కిమ్ హెల్త్ విషయంలోనూ రకరకాల ప్రచారాలు సాగాయి. అతని ఆరోగ్యం క్షీణించిందని.. అప్పట్లో వార్తలొచ్చాయ్. కొన్నాళ్లు.. అతను కెమెరాల ముందుకు కూడా రాలేదు. సడన్‌గా.. ఓ రోజు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు.. కనిపించిన వ్యక్తి.. కిమ్ సాధారణ రూపం కంటే.. ఎక్కువ లావుతో కనిపించాడు. దీంతో.. అతను.. కిమ్‌కు బాడీ డబుల్ అనే వాదన వినిపించింది.

ఇక.. బ్రిటన్ రాణి.. క్వీన్ ఎలిజబెత్ కూడా.. బాడీ డబుల్స్‌ని వినియోగిస్తారనే ప్రచారముంది. ఎందుకంటే.. ఆవిడ ప్రతి ఏటా వందలాది వేడుకల్లో పాల్గొంటూ ఉంటుంది. వీటిలో.. చాలా వరకు టీవీలో ప్రసారం చేస్తుంటారు. అందులో చాలా వరకు.. రిహార్సల్స్ ఉంటాయన్న వాదన ఉంది. ఎందుకంటే.. ఆవిడ గంటల తరబడి నిలబడటం కష్టమవుతుంది. అందుకే.. ఎలిజబెత్ తన స్థానంలో.. తనలాగే ఉండే మరో మహిళను వాడతారనే ప్రచారమైతే ఉంది.

ఇక.. రష్యా చరిత్ర పేజీలను తిరగేస్తే.. సోవియట్ యూనియన్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ కూడా బాడీ డబుల్స్ వినియోగించారనే కథలు కనిపిస్తాయి. రషీద్ అని పిలవబడే అతను స్టాలిన్‌తో పోలిక ఉన్నందున.. సైన్యం నుంచి తొలగించారు. అతను ఇంటికి వెళ్లాక.. రషీద్‌ని రిక్రూట్ చేసుకునేందుకు.. ఓ కేజీబీ ఏజెంట్ వచ్చాడు. అతను.. సమావేశాలు, విందులలో మాత్రమే.. స్టాలిన్ స్థానంలో కూర్చునేవాడు. 1991లో.. 93 ఏళ్ల వయసులో రషీద్ మరణించాడు. ఇక.. స్టాలిన్‌కు చెందిన మరో డూప్‌ ఫెలిక్స్ దాదేవ్. 1942లో.. అతను ఓ యుద్ధంలో గాయపడ్డప్పుడు.. సోవియట్ యూనియన్ అధికారులు అతను చనిపోయినట్లుగా సృష్టించారు. తర్వాత.. అతన్ని స్టాలిన్‌కి ప్రతి రూపంగా మార్చేశారు. దాదేవ్‌కు 88 ఏళ్లు వచ్చే వరకు.. తాను స్టాలిన్ బాడీ డబుల్ అన్న విషయాన్ని దాచే ఉంచారు.

ఇక.. అమెరికా మిలటరీ చెప్పిన దాని ప్రకారం.. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కూడా ఈ రకమైన వ్యక్తులను ఉపయోగించాడనే ప్రచారముంది. అతనిలాంటి వ్యక్తిని సృష్టించేందుకు.. కొందరికి ప్లాస్టిక్ సర్జరీతో పాటు డూప్లికేట్ టాటూలు, బుల్లెట్ రంధ్రాలు, పుట్టుమచ్చలను కూడా వేశారు. అచ్చం.. సద్దాం హుస్సేనే అనిపించేలా చాలా బాగా తయారుచేశారు. అంతేకాదు.. హుస్సేన్ పెద్ద కుమారుడు ఉదయ్ హుస్సేన్ కూడా బాడీ డబుల్‌ని ఉపయోగించి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. లతీఫ్ యాహియా అనే వ్యక్తి.. ఉదయ్‌తో కలిసి పాఠశాలలో చదువుకున్నాడు. 1988లో.. అతను ఇరాక్ మిలటరీలో బలవంతంగా పనిచేస్తున్నాడు. అప్పుడే.. అతని ఇష్టానికి విరుద్ధంగా ఉదయ్ బాడీ డబుల్‌గా ఎంపిక చేశారనే ప్రచారముంది. లతీఫ్ ఉదయ్‌గా నటిస్తున్న సమయంలో.. 26 సార్లు కాల్పులకు గురయ్యాడు. చివరికి.. అతను ఇరాక్ నుంచి తప్పించుకున్నాడు. అతని కథ గురించి.. హాలీవుడ్‌లో ది డెవిల్స్ డబుల్ అనే సినిమా కూడా వచ్చింది.

ఇలా.. చాలా మంది దేశాధినేతలు, ప్రముఖులు.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు.. తమ రక్షణ కోసం.. తమ లాగే మార్చబడ్డ ఇతర వ్యక్తులను వినియోగించారు. ఇప్పుడు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై.. యుక్రెయిన్ తెరమీదకు తీసుకొచ్చిన వాదనతో.. మరోసారి బాడీ డబుల్ అంశం చర్చనీయాంశమైంది.