అమెరికాకి పొంచి ఉన్న కొత్త రకం ముప్పు, ఏప్రిల్ నాటికి ప్రబలరూపం

అమెరికాకి పొంచి ఉన్న కొత్త రకం ముప్పు, ఏప్రిల్ నాటికి ప్రబలరూపం

UK coronavirus variant to become more dominant in US: ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలమైన అగ్రరాజ్యం అమెరికాకి మరో ముప్పు పొంచి ఉందా? కొత్త రకం కరోనా వైరస్ అమెరికాని వణికించనుందా? ఏప్రిల్ నాటికి యూకే వేరియంట్ ప్రబలంగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫాసీ.

కొవిడ్-19 అగ్రరాజ్యం అమెరికాను ఇప్పటికే శవాల దిబ్బగా మార్చింది. ఇంకా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇంతలోనే అమెరికన్లకు మరో కష్టం వచ్చి పడింది. యూకే వేరియంట్ వైరస్ అమెరికాను కలవరపెడుతోంది. యూకే వేరియంట్ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అమెరికాలో క్రమంగా పెగుతోంది. ఈ క్రమంలో అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫాసీ ఆందోళన వ్యక్తం చేశారు.

‘ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. యూకే వేరియంట్ ఉధృతి అమెరికాలో ఏప్రిల్ నాటికి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు. అయితే సౌతాఫ్రికా రకం వైరస్‌కు సంబంధించిన అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. 2020 డిసెంబర్‌లో యూకేలో బయటపడిన కొత్త రకం వైరస్.. ఇప్పటికే అమెరికాలోని 28 రాష్ట్రాలకు పాకింది. 315 మంది దాని బారినపడ్డారు. కొవిడ్-19 కంటే యూకే రకం కరోనా వైరస్ 70 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని పలు నివేదికల్లో వెల్లడైంది.

మరోవైపు అమెరికాలో ఇప్పటివరకు 2.89 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఒక డోసు ఇచ్చారు. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్న దానికంటే నెమ్మదిగా కొనసాగుతోందనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం కుదేలైంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతూనే ఉంది. మరణ మృదంగాన్ని మోగిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు, మరో నాలుగు కొత్త రకాల ఉత్పరివర్తనలతో కరోనా మహమ్మారి తన ప్రభావం మానవాళి మీద కొనసాగిస్తూనే ఉంది. ఒకపక్క కరోనా మహమ్మారి వ్యాక్సిన్ వచ్చి, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా, కరోనా వ్యాప్తి మాత్రం ప్రపంచాన్ని పీడిస్తూనే ఉంది. ఏడాది క్రితం చైనాలో ప్రారంభమైన కరోనా మహమ్మారి ఇప్పటివరకు ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పది కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచంలో ఇప్పటిదాకా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 22లక్షలు దాటింది.

కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాలో విస్తరిస్తున్న ఈ వైరస్ కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా ప్రస్తుత టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం విస్తరిస్తున్న కొత్త వేరియంట్లు మొదట వ్యాప్తిచెందిన కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా వ్యాప్తి చెందేవని నిపుణులు చెబుతున్నారు.