సూపర్ పవర్ కావాలనే చైనా ఇలా చేస్తోంది…FBI డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : July 8, 2020 / 04:59 PM IST
సూపర్ పవర్  కావాలనే చైనా ఇలా చేస్తోంది…FBI డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

మరేతర బాహ్య శక్తి కన్నా చైనా నుంచే అమెరికా భవిష్యత్తుకు ఎక్కువ ముప్పు ఉందని అమెరికాకు చెందిన ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్(ఎఫ్‌బీఐ) డైర‌క్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ వ్రే తెలిపారు. ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించడానికి ఏం చేయడానికైనా చైనా సిద్ధంగా ఉందని ప్ర‌పంచ‌దేశాల‌కు అయన హెచ్చ‌రిక‌లు చేశారు.

వాషింగ్ట‌న్‌లోని హ‌డ్స‌న్ ఇన్స్‌టిట్యూట్‌లో మంగళవారం ఎఫ్‌బీఐ చీఫ్ మాట్లాడుతూ… సూప‌ర్ ప‌వర్ కావాల‌న్న ఉద్దేశంతోనే చైనా అన్ని ర‌కాల త‌ప్పుడు ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు తెలిపారు. చైనాకు చెందిన క‌మ్యూనిస్టు పార్టీ ఈ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వ్రే ఆరోపించారు. ఏదైనా చేసి అత్యంత శ‌క్తివంతంగా త‌యారు కావాల‌న్న దీక్ష‌తోనే చైనా భిన్న ప‌ద్ధ‌తుల‌ను వాడుతున్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు.

విద్యావేత్త‌లు, జ‌ర్న‌లిస్టులు, అమెరికా మీడియాపైన కూడా చైనా వ‌త్తిడి తెస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లోనూ చైనాకు అండ‌గా ఉండాల‌ని ఆ దేశ ప్ర‌తినిధులు అమెరికాపై వ‌త్తిడి తీసుకువ‌స్తున్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు. చైనా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వ‌ల్ల అమెరికా వాణిజ్యం దెబ్బ‌తిన‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

చైనా చేప‌డుతున్న ప్రాప‌ర్టీ, ఇంట‌లెక్చువ‌ల్ చోరీ వ‌ల్ల అమెరిక‌న్లు ఎక్కువ శాతం బాధితులు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు. ఎఫ్‌బీఐ దగ్గర సుమారు అయిదు వేల‌కు పైగా కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ కేసులు ఉన్నాయ‌ని, వాటిల్లో సగం కేసులు చైనాకు లింకై ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.