నువ్విచ్చిన ఈ చివరి గిఫ్ట్.. కళ్లలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటా’

  • Published By: srihari ,Published On : June 13, 2020 / 12:19 PM IST
నువ్విచ్చిన ఈ చివరి గిఫ్ట్.. కళ్లలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటా’

మహమ్మారి కరోనా వైరస్‌ గురించి ముందుగానే హెచ్చరించిన వుహాన్ కళ్ల డాక్టర్ అదే వైరస్ బారినపడి బలైపోయ్యాడు. ఇప్పుడు అతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. కళ్ల డాక్టర్‌ లీ వెన్లియాంగ్‌ భార్య ప్రసవించిన విషయాన్ని ఆమె తన చైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వీచాట్‌లో పోస్టు చేసింది. ‘నువ్వు నాకిచ్చిన ఇదే చివరి గిఫ్ట్.. ఈ గిఫ్ట్ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. స్వర్గం నుంచి నువ్వు ఇది చూస్తున్నావా’ అంటూ ఆమె రాసుకొచ్చింది. రెండో సంతానం శిశువు ఫోటోను కూడా ఆమె షేర్‌ చేసింది. 

వుహాన్‌ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంలో స్థానిక వైద్యుడైన వెన్లియాంగ్ మహమ్మారి తీవ్రతను గురించి హెచ్చరించే ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో దీనిపై పోస్ట్ కూడా చేశారు. వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆస్పత్రిలో డిసెంబర్‌లో 7గురు వైరల్ ఇన్ఫెక్షన్‌తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన SARS వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్‌కు అనుమానం వచ్చింది. 

తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబర్ 30న ఆయన మెసేజ్‌ పెట్టారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని సూచించారు. దీనిపై బయట ఎక్కడా మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని ఆయనను హెచ్చరించారు. చివరకు లీ వెన్లియాంగ్‌ కూడా కరోనా వైరస్ కు బలైపోయాడు.