ట్రంప్‌ సెక్యూరిటీకి కొండముచ్చులు

  • Edited By: madhu , February 23, 2020 / 09:43 AM IST
ట్రంప్‌ సెక్యూరిటీకి కొండముచ్చులు

ట్రంప్ టూర్‌… అత్యంత హై సెక్యూరిటీ. అడుగు అడుగునా పటిష్ట నిఘా. అటు అమెరికా పోలీసులు.. ఇటు భారత ఖాకీలు. అంతా అలర్ట్‌గా ఉంటారు. డేగ కళ్లతో నిఘా పెడతారు. అయితా ఇంతగా భద్రత కల్పిస్తున్న అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీలో ఇదంతా ఒక ఎత్తు.  ఐదు బ్లాక్‌ కాప్స్‌ మరో ఎత్తు. అవును  ఇది నిజంగా నిజం. ఎందుకంటే… ఆ కాప్స్‌ లేనిదే అగ్రరాజ్యం అధినేత అడుగైనా వేయలేరు. అధునాతన ఆయుధాలున్నా… ఆ కాప్స్‌ ఇచ్చే రక్షణను ఎవరూ ఇవ్వలేరు. అందుకే ఆ కాప్స్‌ని చూస్తే ప్రత్యర్థులు సైతం పరుగు పెడతారు. ఇంతగా చెప్పుకుంటున్న ఆ కాప్స్‌ ఎవరో తెలుసా? అది అమెరికాలోని సీక్రెట్ ఏజెన్సీ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ బ్లాక్‌ కాప్స్‌ పక్కా లోకల్‌… అంతకుమించి మేడిన్‌ ఇండియా. 

ట్రంప్ భద్రతను చూసే అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కావు. పారా మిలిటరీ దళాలు అస్సలే కాదు.. ఎన్ఎస్‌జీ కమాండోలు కానే కాదు. కానీ ఆగ్రాలో అగ్రనేతకు అవే రక్ష. ఇంతకీ ఏంటా సూపర్ పవర్ అనుకుంటున్నారా..? అవి కొండముచ్చులు.. ఎస్.. మీరు విన్నది కరెక్టే.. భారత్ పర్యటనలో భాగంగా ట్రంప్ ఆగ్రాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ట్రంప్… తన భార్య మెలానియాతో కలిసి… తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. అది ప్రేమ చిహ్నం కావడంతో.. ట్రంప్ మొలానియాతో కలిసి వెళ్లనున్నారు. అయితే ట్రంప్ వెంట భారీ భద్రత ఉన్నప్పటికీ.. ఆగ్రాలో మాత్రం కష్టాలు తప్పకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఆగ్రాలో ఉన్న కోతులు. ఆగ్రాలో ట్రంప్ పర్యటన నేపథ్యంలో.. భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇందుకు పరిష్కారంగా భద్రతా దళాలు ట్రంప్ కాన్వాయ్ మార్గంలో ఐదు కొండముచ్చులను మోహరిస్తున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రా నగరంలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్న క్రమంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతా ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తాజ్‌మహల్ సందర్శన సమయంలో కోతుల బెడద ఉందని ఆందోళనలు ఎక్కువయ్యాయి. అయితే ట్రంప్ పర్యటన సమయంలో సందర్శకులు ఉండరని, దీంతోపాటు భద్రతా బలగాలు మోహరించి ఉంటున్నందున కోతుల బెడద ఉండదని సీఐఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఐదు కొండ ముచ్చులను అధికారులు రంగంలోకి దించుతున్నారు. గత ఆరు నెలలుగా తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన వారి చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయని సందర్శకులు చెపుతున్నారు. దీంతో ట్రంప్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. 

Read More : ట్రంప్ టూర్ : నమస్తే ట్రంప్‌కు రూ. 120 కోట్లు ఖర్చు