Xi Jinping WAR Warning : పూర్తిగా సైన్యం మీదే ఫోకస్ చేసిన జిన్ పింగ్ .. PLAను మరింత స్ట్రాంగ్‌గా మార్చేందుకు కీలక సూచనలు
పూర్తిగా సైన్యం మీదే ఫోకస్ పెట్టారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. PLAను మరింత స్ట్రాంగ్‌గా మార్చేందుకు కీలక సూచనలిచ్చారు ఆర్మీ అధికారులకు. PLA ఆధునిక పోరాట శక్తిగా రూపాంతరం చెందాలంటే కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా వర్తింపజేయాలని నొక్కిచెప్పారు. యుద్ధాలను గెలవడానికి సైనిక శిక్షణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

Xi Jinping WAR Warning : డ్రాగన్ కంట్రీ.. ఏ లక్ష్యంతో ముందుకెళుతోంది? తైవాన్‌ని ఆక్రమించుకోవడమా? లేక.. చైనా పునరేకీకరణా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. కానీ.. జిన్ పింగ్ సైన్యాన్ని మరింత పటిష్టంగా మలచడం, రాజ్యాధికారం వైపే మొగ్గు చూపుతున్నారు. తమ ఎయిర్‌ఫోర్స్‌కు ట్రైనింగ్ ఇచ్చేందుకు.. రహస్యంగా విదేశాల నుంచి పైలట్‌ను తెచ్చుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎలాంటి ఎయిర్‌క్రాఫ్ట్ అయినా నడిపేలా.. తమ ఎయిర్‌ఫోర్స్‌లోని పైలట్లకు శిక్షణ ఇప్పిస్తోంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.
మూడోసారి చైనా అధ్యక్షుడిగా, మిలటరీ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జిన్ పింగ్ తన ఫోకస్ మొత్తం సైన్యం మీదే పెట్టారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఎలా ఆధునీకరించాలి? మరింత పటిష్టంగా ఎలా మార్చాలన్న దానిపైనే దృష్టి పెట్టారు.PLA ఆధునిక పోరాట శక్తిగా రూపాంతరం చెందాలంటే కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా వర్తింపజేయాలని నొక్కిచెప్పారు. యుద్ధాలను గెలవడానికి సైనిక శిక్షణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అంతేకాదు.. చైనా ఇప్పుడు యూకేలోని మాజీ, తాజా సైనిక పైలట్ల కోసం వేట మొదలుపెట్టింది. వాళ్లందరినీ.. డ్రాగన్ సైన్యంలోని ఎయిర్‌ఫోర్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం రిక్రూట్ చేసుకుంటోంది. ఆస్ట్రేలియాకు చెందిన పైలట్లను కూడా చైనా తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మాజీ బ్రిటీష్ మిలటరీ పైలట్ల అనుభవాన్ని, అవసరమైన ట్రైనింగ్‌ని.. చైనీస్ మిలటరీకి అందించేందుకు.. వారికి పెద్ద మొత్తంలో చెల్లిస్తోంది. ఒక్కొక్కరికి 2 కోట్ల 20 లక్షల దాకా ప్యాకేజీలు ఉన్నట్లు తెలుస్తోంది.
చైనా.. ఇతర దేశాల మాజీ సైనికాధికారులను సీక్రెట్‌గా రిక్రూట్ చేసుకోవడం కొత్తేమీ కాదు. 2019లో యూకేలో వచ్చిన కొన్ని రిపోర్టుల ఆధారంగా.. ఒకరి తర్వాత మరొకరిని చైనాకు తీసుకెళ్తున్నారని తెలిసింది. అయితే.. కోవిడ్ తర్వాత ఇది కాస్త తగ్గిపోయింది. మహమ్మారి వైరస్ వల్ల.. ఎప్పుడైతే అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించారో.. అప్పుడు బ్రిటన్ మాజీ సైనికాధికారులను చైనా తీసుకెళ్లడం తగ్గిపోయింది. మళ్లీ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత.. ఈ విధమైన కేసులు బయటపడుతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయ్. వీరిలో చాలా మంది ఇటీవలికాలంలోనే.. ఆర్మీని వదిలేసిన వాళ్లు, 50 ఏళ్ల వయసు గల వారే ఉన్నట్లు చెబుతున్నారు. వీళ్లకు.. అన్నిరకాల ఎయిర్ క్రాఫ్ట్‌లను నడిపిన అనుభవం ఉంది. టైఫూన్‌లు, జాగ్వార్‌లు హారియర్‌లు, టోర్నడోలతో పాటు వివిధ రకాల జెట్‌లను సైన్యంలో నడిపిన అనుభవం ఉంది. చైనా కూడా ఏరి కోరి వీళ్లనే సెలక్ట్ చేసి.. టార్గెట్ చేసి.. పెద్ద మొత్తంలో ఆఫర్ చేసింది. వాళ్ల సైన్యానికి.. ట్రైనింగ్ ఇచ్చేందుకు చైనాకు లిఫ్ట్ చేసింది. ఒక్క.. యూకే మాత్రమే కాదు.. ఇతర మిత్ర దేశాలకు చెందిన పైలట్లను కూడా డ్రాగన్ టార్గెట్‌గా చేసుకుంటోందనే నివేదికలు వస్తున్నాయి.
ఇంటలిజెన్స్ రిపోర్టుల ప్రకారం.. మాజీ సైనికాధికారుల రిక్రూట్‌మెంట్ అంతా మధ్యవర్తుల ద్వారానే జరుగుతోంది. ఇందులో సౌతాఫ్రికాలోని.. ఓ ఫ్లయింగ్ అకాడమీ ప్రమేయం ఉందని చెబుతున్నారు. యూకే ప్రభుత్వం కూడా తమ పైలట్‌లను సంప్రదించింది. చైనా ఆర్మీ కోసం పనిచేయొద్దని కోరింది. తిరిగి.. బ్రిటన్‌కు వచ్చేయాలని చెప్పింది. ఇక.. చైనా ఎయిర్‌ఫోర్స్ కోసం పనిచేస్తున్న పైలట్స్ అంతా.. యూకే అధికారిక రహస్యాల చట్టానికి లోబడే ఉన్నారా? రక్షణకు సంబంధించిన రహస్యాలు బహిర్గతం చేయకుండా ఉండే ఒప్పందానికి కట్టుబడి ఉన్నారా? అనే దానిపై.. ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. చైనా అధికారులు మాత్రం ఇలాంటి ఘటనల గురించి తమకేమీ తెలియదని ప్రకటించారు. అయితే.. యూకే ప్రభుత్వాన్ని అనుసరించి.. ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా దీనిని నిరోధించేందుకు.. జరిమానా విధించేందుకు తక్షణ చర్యలు తీసుకుబోతున్నట్లు తెలిపింది.
Taiwan Vs China : చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరిగితే మిగతా దేశాలపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఇతర దేశాల మాజీ సైనిక పైలట్లను.. తమ ఆర్మీ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు.. చైనా రహస్యంగా తీసుకెళుతోందంటే.. డ్రాగన్ దీర్ఘకాలిక లక్ష్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎలాంటి ఎయిర్‌క్రాఫ్ట్‌నైనా నడిపేందుకు చైనా తమ పైలట్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే.. ఆ దిశగా కొంతమేర సక్సెస్ అయింది. ఇప్పుడు.. తైవాన్‌తో యుద్ధానికి దిగినా.. డ్రాగన్ ఎయిర్ ఫోర్స్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది. తైవాన్‌కు మద్దతుగా యూఎస్ ఎయిర్‌ఫోర్స్ దాడులు చేసినా.. వాటిని తిప్పికొట్టగలిగే తెలివి, కెపాసిటీ.. చైనా వైమానికదళం సంపాదించే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జిన్‌పింగ్ రెండు సార్లు ప్రెసిడెంట్‌గా ఉంటేనే.. చైనాతో పాటు ప్రపంచ దేశాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయ్. అలాంటిది.. మూడోసారి డ్రాగన్ కంట్రీ పగ్గాలు చేపట్టాక.. ఎవరూ ఊహించని దూకుడుతో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా.. తైవాన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. తన సైనిక సామర్థ్యాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చి.. పరోక్షంగా ప్రపంచానికి కూడా ఓ హెచ్చరిక పంపారు. రాబోయే రోజుల్లో.. జిన్ పింగ్ ఎప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదు. ఏ వ్యూహం అమలు చేస్తారో అస్సలు ఊహించలేం. పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడంతో మొదలుపెట్టి.. ఏకంగా వార్ బెల్స్ మోగించేదాకా వచ్చేశారు. భారత సరిహద్దుల్లో ఘర్షణలైనా.. తైవాన్‌ని ఆక్రమించుకునే ప్లాన్ అయినా.. పొరుగు దేశాలకు పక్కలో బల్లెంలా మారింది చైనా. రానున్న రోజుల్లో పరిస్థితులు కాస్త తీవ్రంగా ఉంటాయని.. ప్రమాదాలకు సిద్ధంగా ఉండాలని.. ఏం జరిగినా తట్టుకునేందుకు అంతా సంసిద్ధులై ఉండాలని.. ఇటీవల జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ నేషనల్ కాంగ్రెస్‌లోనూ.. పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు జిన్‌పింగ్. ఇప్పుడు.. 20 లక్షల మంది సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, వారికి.. దిశానిర్దేశం చేయడంతో.. మున్ముందు జిన్ పింగ్ అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఆందోళన రేపుతోంది.
గడిచిన పదేళ్లలో.. పార్టీతో పాటు తన పాలనపైనా పట్టు పెంచుకున్నారు జిన్‌పింగ్. భద్రత, మిలటరీ, ధృడమైన దౌత్యం, బలమైన ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమిస్తూ దేశాన్ని ముందుకు నడిపించారు. అయితే.. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా జాతీయ భద్రత మీదే కనిపిస్తోంది. ఆ దిశగానే.. అడుగులు వేస్తున్నారని అర్థమైపోయింది. రాబోయే కాలంలో చైనా అనేక ప్రమాదాలను ఎదుర్కొంటుందని.. దేశం ఒక యుద్ధం లాంటి పరిస్థితుల్లో చిక్కుకుందని.. వాటి నుంచి బయటపడాలంటే.. డ్రాగన్ సైన్యమే ముందుండి పోరాడాలని చెబుతున్నారు. ఇప్పటికే.. చైనాలో తన అధికారాన్ని, పట్టుని కోల్పోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జిన్ పింగ్.. మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా అవతరించేందుకు.. అన్ని వైపుల నుంచి రూట్ క్లియర్ చేసుకుంటూ వెళుతున్నారు.