అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష

అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష

france అవినీతి కేసులో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు 3ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇందులో రెండు ఏళ్లను కోర్టు సస్పెండ్‌ చేసింది. దీంతో దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్‌ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే దీనిపై అపీల్‌ చేసేందుకు ఆయనకు కోర్టు పది రోజులు గడువు ఇచ్చింది. తన ప్రచార ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోకు చెందిన న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతి కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో సర్కోజీకి ఈ శిక్ష పడింది. .

నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల ప్రచారంలో ఆయన లిబియా నుంచి భారీ ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. 2011 లో హత్యకు గురైన లిబియా నాయకుడు ముయమ్మర్ గడ్డాఫీ నుండి 2007 ఎన్నికల ప్రచారానికి డబ్బును స్వీకరించడం ప్రధాన ఆరోపణ. 2012లో గడాఫీ కుమారుడు..తన తండ్రి 50 మిలియన్ యూరోలకు పైగా ఎన్నికల నిధిని స్పాన్సర్ చేసినట్లు చెప్పారు. ఫ్రెంచ్ చట్టం విదేశీ వనరుల నుండి ఎన్నికల నిధులను సమకూర్చడాన్ని నిషేధిస్తుంది. ఈ లావాదేవీలను ధృవీకరించే పత్రాలు కూడా బయటపడ్డాయి. అయితే వీటిని నకిలీ డ్యాక్యుమెంట్లుగా అప్పట్లో సర్కోజీ పేర్కొన్నారు.

సర్కోజీ ఎన్నికల ప్రచారానికి లిబియా ఫైనాన్సింగ్‌పై దర్యాప్తు ఏప్రిల్ 2013 లో ప్రారంభమైంది. లిబియా నుంచి ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు సందర్భంగా బయటికొచ్చిన.. సర్కోజీ, ఆయన లాయర్ థియరీ హెర్జోగ్ మధ్య జరిగిన టెలిఫోన్‌ సంభాషణలు అప్పట్లో సంచలనం రేపాయి. తన ప్రచార ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోలో న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతిని కల్పించారన్న ఆరోపణలు సర్కోజీ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అవినీతి కేసు దర్యాప్తుకు సంబంధించి ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని 2018 మార్చి 20 న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్కోజీపై ఆరోపణలతో ఏకీభవించిన ఫ్రెంచ్‌ న్యాయస్థానం సోమవారం అతన్ని దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.