ఫ్రాన్స్ లో బర్డ్ ఫ్లూ భయం : 6 లక్షల పక్షుల్ని పూడ్చేపెట్టేయని ప్రభుత్వం ఆదేశాలు

ఫ్రాన్స్ లో బర్డ్ ఫ్లూ భయం : 6 లక్షల పక్షుల్ని పూడ్చేపెట్టేయని ప్రభుత్వం ఆదేశాలు

Bird flu 2021 in France : భారత్ లోనే కాదు ఫ్రాన్స్ లో కూడా బర్డ్ ఫ్లూ భయం పుట్టిస్తోంది. ఇండియాలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వల్ల లక్షలాది పౌల్ట్రీ పక్షులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈ వైరస్ భారత్ తోనే కాకుండా పలు దేశాల్లో పక్షులు పాలిట మృత్యువుగా మారింది.

ఈక్రమంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌పై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. దీంట్లో భాగంగా కోళ్ల, బాతుల ఫారాల్లోని 6 లక్షల పక్షులను పూడ్చిపెట్టాలని నిర్ణయించింది. ఇది దారుణమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తోంది. ఇటువంటి చర్యలు తీసుకోకుంటే ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులుఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫ్రాన్స్‌లోని వాయవ్య ప్రాంతంలో బాతులకు బర్డ్ ఫ్లూ సోకింది. అది క్రమంగా మిగతా బాతులు, కోళ్లతో పాటు ఇతర పక్షులకు కూడా వ్యాపిస్తోంది. ఇది మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాపిస్తుందనే ఉద్దేశంతో…వ్యవసాయ శాఖ మంగళవారం (జనవరి 5,2021) కోళ్ల, బాతుల ఫారాల్లోని 6 లక్షల పక్షులను పూడ్చిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా..గతేడాది చివర్లో యూరోపియన్ దేశాల్లో ఈ బర్డ్ ఫ్లూ వ్యాపించింది. మిగతా దేశాల్లో కంటే ఫ్రాన్స్‌లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించింది. ఇది చాలా వేగంగా, ఈజీగా వ్యాపించే లక్షణం ఉన్న వైరస్ కావటంతో ఏమాత్రం ఆలస్యం చేసినా తెల్లారే సరికి మరన్ని పక్షులకు వ్యాపించేస్తుంది. దీంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తోంది.

ఇప్పటికే ఫ్రాన్స్ ప్రభుత్వం 2 లక్షల కోళ్లు, బాతులు, 4 లక్షల ఇతర పక్షుల్ని చంపి సమాధి చేసింది. మరో 4 లక్షల పక్షుల్ని చంపబోతున్నారు. వాటిని ఎక్కడ పూడ్చి పెట్టాలో ప్రదేశాలు ఎంచుకుంటున్నారు.

జనవరి 1న H5N8 వైరస్ 61 పక్షుల్లో ఉన్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వాటిలో 48… వాయవ్య ప్రాంతంలోని లాండెస్ ఏరియాలో ఉన్నాయి. ఈ లాండెస్ ఏరియాలో బాతులను పెంచుతారు. అక్కడ ఇలాంటి పెద్ద పరిశ్రమ ఉంది. అక్కడ ఈ వైరస్ బాగా వ్యాపించింది. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది.