చైనా లీక్స్ : విదేశీ కాన్సులేట్లు, ఫైజర్ వంటి ప్రముఖ సంస్థల్లో చైనా గూఢచర్యం

  • Published By: venkaiahnaidu ,Published On : December 14, 2020 / 09:27 PM IST
చైనా లీక్స్ : విదేశీ కాన్సులేట్లు, ఫైజర్ వంటి ప్రముఖ సంస్థల్లో చైనా గూఢచర్యం

చైనా దొంగబుద్ధి మరోసారి ఆధారాలతో సహా బయటపడింది.షాంఘైలో వివిధ దేశాల ఎంబసీల కేంద్రంగా చైనా సాగించిన కుట్ర బయటపడింది. ఆస్ట్రేలియా మీడియా బయటపెట్టిన రిపోర్టుల ప్రకారం…తన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ద్వారా విదేశాల కాన్సులేట్లు మరియు కరోనా వ్యాక్సిన్ తయారీదారు “ఫైజర్”సహా ప్రముఖ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల్లోకి చైనా అక్రమంగా చొర‌బ‌డుతోంది. జీ జిన్‌పింగ్ నేతృత్వంలో క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఎలా ప‌ని చేస్తుందో తాజా లీకులు బ‌య‌ట‌పెట్టాయ‌ని ఆస్ట్రేలియన్ మీడియా తెలిపింది.

త‌మ కార్య‌కర్త‌ల ద్వారా ఆయా దేశాల, సంస్థ‌ల ర‌హ‌స్య స‌మాచారాన్ని చైనా దొంగిలిస్తోంద‌ని లీక్ అయిన డాక్యుమెంట్లు ద్వారా తేలింది. వాస్తవానికి చైనా ఈ ప‌నికి పాల్పడుతోంద‌ని ఎప్ప‌టి నుంచో అనుమానం ఉన్నాఇప్పుడు అందుకు త‌గిన ఆధారాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.అంతేకాకుండా జిన్‌ జియాంగ్‌లో చైనా అణ‌చివేత విధానాల‌ను కూడా లీకైన ప‌త్రాలు బ‌య‌ట‌పెట్టాయి.

ఆస్ట్రేలియా పత్రికకు ఓ అజ్ణాత వ్యక్తి లేదా విజిల్ బ్లోయర్ లీక్ చేసిన డాక్యుమెంట్ల ప్రకారం…క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPP)కు చెందిన కార్య‌క‌ర్త‌లు భారత్ స‌హా దాదాపు 10 దేశాల కాన్సులేట్ల‌లోకి చొర‌బ‌డ్డారు. 10ఏళ్ల నుంచి షాంఘైలోని ఇండియా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జ‌ర్లాండ్‌, న్యూజిలాండ్‌, ఇట‌లీ, సౌతాఫ్రికా కాన్సులేట్ల‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ‌ర్క‌ర్ల చొర‌బాట్లు జ‌రుగుతున్నాయి. షాంఘై ఫారిన్ ఏజెన్సీ స‌ర్వీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా పార్టీ కార్య‌కర్త‌ల‌ను ఆయా కాన్సులేట్ల‌లో చైనా రిక్రూట్ చేసింది.

ఇక,అమెరికాకు చెందిన క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీదారు “ఫైజ‌ర్‌”,బోయింగ్ ఎయిర్‌లైన్స్,HSBC వంటి ప్రముఖ సంస్థల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ‌ర్క‌ర్లు పాగా వేశారు. అమెరికా,బ్రిటన్ లలో ప్రముఖ సంస్థల్లో సీపీపీ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా, అమెరికా యూనివ‌ర్సిటీల‌లోనూ పెద్ద సంఖ్యలో సీపీపీ సభ్యులు ఉన్న‌ట్లు తేలింది. సుమారు 20 ల‌క్ష‌ల మంది సీపీసీ వ‌ర్క‌ర్లు ఈ మొత్తం గూఢచర్య వ్యవహారంలో ఉన్న‌ట్లు ఆస్ట్రేలియా ప‌త్రిక వెల్ల‌డించింది. కాగా, అమెరికా ఇంధ‌న సంస్థ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటోంద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ ఏడాది జులైలో హూస్ట‌న్‌లోని చైనీస్ కాన్సులేట్‌ను మూసివేసిన విషయం తెలిసిందే.

వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ(CPP) మెంబర్లు ఉన్నారు. చైనీస్ క‌మ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్లు ఆర్థిక స‌ల‌హాదారులు, రాజ‌కీయ‌, పరిపాల‌న వ్య‌వ‌హారాల్లో సీనియ‌ర్ స్పెష‌లిస్ట్‌లుగా ఉన్నట్లు ఆస్ట్రేలియ‌న్ ప‌త్రిక తెలిపింది.

మరోవైపు,ఇటీవల అమెరికా.. త‌మ దేశంలో సీక్రెట్‌గా జ‌రుగుతున్న ఓ ఇంటెలిజెన్స్ ఆప‌రేష‌న్‌ ని బ‌య‌ట‌పెట్టింది. ఈ ఆప‌రేష‌న్‌ లో భాగంగా సైంటిఫిక్, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్‌ల డేటా సేక‌రిస్తున్న‌ట్లు గుర్తించారు. త‌మ దేశంలో జ‌రిగిన ఈ వాణిజ్య ర‌హ‌స్యాల చోరీ, కార్పొరేట్ గూఢ‌చ‌ర్యం వ‌ల్ల చైనానే ల‌బ్ధి పొందిన‌ట్లు కూడా అమెరికా చెప్పింది.