యూరప్ లో 1లక్ష దాటిన కరోనా మరణాలు…జర్మనీలో లాక్ డౌన్ సడలింపు

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 08:12 AM IST
యూరప్ లో 1లక్ష దాటిన కరోనా మరణాలు…జర్మనీలో లాక్ డౌన్ సడలింపు

కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో జర్మనీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. అయితే 145,742 కేసెులు ఉన్నప్పటికీ కేవలం 4వేల 642మరణాలు మాత్రమే జర్మనీ నమోదయ్యాయి. అంతేకాకుండా జర్మనీలో 91,500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2889 మందికి మాత్రమే కరోనా సీరియస్‌గా ఉంది. మిగతావాళ్లకు కరోనా తగ్గిపోయే అవకాశాలు 99 శాతం ఉన్నాయి. కరోనాను కట్టడి చేయడంలో జర్మనీ విజయం సాధించిందనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు యూరప్ లో కరోనా మరణాల సంఖ్య 1లక్ష దాటిన సమయంలో లాక్డౌన్ నిబంధనలు సడలించి,మిగతా యూరప్ దేశాల్లో కాన్ఫిడెన్స్ పెంచుతుంది జర్మనీ. తద్వారా ఆ దేశాలు కూడా కరోనాపై జర్మనీ బాటలో ముందుకెళ్తాయి. 

పరిస్థితులు మెరుగవ్వడంతో… జర్మనీ ప్రభుత్వం నెల రోజుల లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా సోమవారం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కొన్ని ఏరియాల్లో చిన్న షాపులు తెరచుకోవచ్చని చెప్పింది. జర్మనీలో అధికార, ప్రతిపక్ష నేతలంతా ఒకే మాటమీద ఉన్నారు. కరోనా కంట్రోల్ అయ్యిందని ప్రకటించారు. ఇకపై జర్మనీలో పూల దుకాణాలు, ఫ్యాషన్ స్టోర్లు, అంటే.. 8600 చదరపు మీటర్ల లోపు ఉండే షాపులన్నీ తెరచుకున్నట్లే. వాటిలోకి ఇకపై ప్రజలు సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ వెళ్లవచ్చు. నెల కిందట జర్మనీ లాక్‌డౌన్ విధించినప్పుడు… అత్యంత కఠినంగా అమలుచేసింది. ఇప్పుడు జర్మనీలోని 16 రాష్ట్రాలు… వేర్వేరు ప్రదేశాల్లో నిబంధనల్ని సడలిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం… ఇంకొన్ని రోజులు లాక్‌డౌన్ కఠినంగానే ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది.మరోవైపు నార్వే కూడా లాక్ డౌన్ నిబంధనలు సడలించింది. ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

ప్రపంచంలో కరోనాను గెలిచిన దేశాలుగా దక్షిణ కొరియా, చైనా, జర్మనీ, తైవాన్ ఇలా కొన్ని ఉన్నాయి. ఆ దేశాలు ఎలా ఎదుర్కొన్నాయో… మిగతా దేశాలు గమనిస్తున్నాయి. మన భారత దేశం కూడా ఈ విజేతల లిస్టులో ఉన్నప్పటికీ… చాలా దేశాలు భారత్‌లో ఇంకా కరోనా పూర్తిగా రాలేదనీ… మున్ముందు అది పెరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాయి. కరోనా పెరిగేటప్పుడు భారత్ ఎలా ఎదుర్కొంటుందన్నదాన్ని బట్టీ… భారత్‌ను విజేతగా నిర్ణయించాలో లేదా అన్నది డిసైడ్ చేసుకోనున్నాయి. కరోనాపై గెలిచిన దేశాల్లో ఏ ఒక్క దాంట్లోనూ కరోనాకి మందు లేదు. అన్నింటి మొదటి విజయ రహస్యం లాక్‌డౌనే. రెండో విజయరహస్యం… ఎక్కువ టెస్టులు. భారత్… ఇప్పటికే లాక్‌డౌన్ ద్వారా కరోనాను నిలువరించింది. కాబట్టి… ఎక్కువ టెస్టులు కూడా జరిపిస్తే… రెండో విధంగా కూడా భారత్ విజయం సాధించే ఛాన్స్ ఉంటుంది. 

కాగా,యూరప్ లో కరోనా మరణాల సంఖ్య 101,859గా ఉండగా,కేసుల సంఖ్య 1,089,674గా ఉంది. ముఖ్యంగా ఐదు యూరప్ దేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. స్పెయిన్ లో 198,674కేసులు నమోదవగా,20,453 మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో 178,972కేసులు నమోదవగా,23,660మంది మరణించారు. ఫ్రాన్స్ లో 152,894కరోనా కేసులు…19,718 మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్ లో 120,067కేసులు నమోదుకాగా, 16,060మంది ప్రాణాలు కోల్పోయారు.