Booster Dose : ఇజ్రాయిల్ బాటలో జర్మనీ, యూకే.. పౌరులకు కొవిడ్ బూస్టర్ డోస్

ఏడాదిన్నర దాటింది.. వ్యాక్సిన్లూ వచ్చాయి. కానీ, కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగలేదు. ఈ వైరస్.. ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. ఇంకా అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా

Booster Dose : ఇజ్రాయిల్ బాటలో జర్మనీ, యూకే.. పౌరులకు కొవిడ్ బూస్టర్ డోస్

Booster Dose

Booster Dose : ఏడాదిన్నర దాటింది.. వ్యాక్సిన్లూ వచ్చాయి. కానీ, కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగలేదు. ఈ వైరస్.. ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. ఇంకా అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు టీకాకు లొంగని పరిస్ధితి నెలకొంది. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సైతం తిరిగి వ్యాధి బారిన పడుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో టీకాల ద్వారా వైరస్ నుండి కలిగే రక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ నేపధ్యంలో బూస్టర్ డోస్ తెరపైకి వచ్చింది. దీని ఆవశ్యకతపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పెద్దఎత్తున పరిశోధనలను వేగవంతం చేశారు. బూస్టర్ డోస్ ఇవ్వటం అవసరమా…ఇస్తే ఎవరికివ్వాలి.. దీని వల్ల కలిగే ఫలితం ఏమిటి? అన్న విషయాలపై విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు.

రెండు డోసుల టీకా ఇచ్చిన తర్వాత అదనంగా(మూడోసారి) ఇచ్చే డోసుని బూస్టర్ డోసు అంటారు. కాలం గడిచే కొద్దీ టీకా సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి బూస్టర్‌ డోసు అవసరమని నిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో రోగనిరోధక శక్తి కొంత తగ్గుతుంది. కాబట్టి, వారికి ప్రాధాన్య ప్రాతిపదికపై కొన్ని దేశాలు బూస్టర్‌ డోసులు వేస్తున్నాయి. అలాగే దీర్ఘకాలంగా రోగాలతో బాధ పడుతున్న వారికి కూడా బూస్టర్ డోసు అవసరం ఎంతైనా ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రస్తుతం పుట్టుకొస్తున్న కరోనా కొత్త వేరియంట్లను సైతం ఎదుర్కొనేలా ఈ బూస్టర్ డోసు సమర్ధవంతంగా తయారు చేస్తారు.

ఇటీవలి కాలంలో డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. జనవరిలో టీకాలు వేసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినట్లు తేలడంతో కొన్ని దేశాలు వయోధికులకు బూస్టర్‌ డోసులివ్వడం మొదలుపెట్టింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే దీర్ఘకాల రోగులకు బూస్టర్‌ డోసులు ఇవ్వాలని నిపుణులు సిఫార్సు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, లుకేమియా, కీళ్లవాతంతో బాధపడుతున్నవారికి, అవయవ మార్పిడి చేయించుకున్నవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

అమెరికాతోపాటు యూరప్ దేశాలు సైతం బూస్టర్‌ డోసుకు ఆమోదం తెలపకపోయినా, వృద్ధ పౌరులకు మూడో డోసు ఇచ్చే కార్యక్రమాన్ని ఇజ్రాయెల్‌ ఇప్పటికే చేపట్టింది. రెండు డోసులు ఇచ్చిన తర్వాత బూస్టర్‌ డోసు ఇస్తున్న దేశం ప్రపంచంలో ఇజ్రాయెల్‌ ఒక్కటే.

ఇప్పుడు.. జర్మనీ, బ్రిటన్ సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. తమ దేశ పౌరులకు కూడా బూస్టర్ షాట్(వ్యాక్సిన్ మూడో డోసు) ఇచ్చే ప్లాన్ లో ఉన్నామని ఆ రెండు దేశాలు ప్రకటించాయి. సెప్టెంబర్ నుంచి బూస్టర్ డోసు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. రెండో డోస్ ప్రభావం ఐదారు నెలల్లో తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కరోనా కొత్త వేరియంట్లు తయారువుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవడానికి బూస్టర్ డోసు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎక్కువ రిస్క్ ఉన్న వారికి అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ముందుగా బూస్టర్ డోసు ఇవ్వాలని జర్మనీ భావిస్తోంది. ఇక 12 నుండి 17 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలందరికీ కూడా టీకాలు అందుబాటులో ఉంచడానికి జర్మనీ దేశం ప్రణాళికలు రూపొందించింది. యూకేలో క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 6 నుంచి తమ దేశ పౌరులకు దాదాపు 32లక్షల టీకా డోసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

యూకేపై డెల్టా వేరియంట్ పంజా విసిరింది. ఒక్కసారిగా అక్కడ కొత్త కేసులు పెరిగాయి. రోజువారీ పాటిజివ్ కేసుల సంఖ్య 26వేల 108గా ఉంది. ఈ కేసుల్లో చాలావరకు డెల్టా వేరియంట్‌వే ఉన్నాయి. జర్మనీలోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఒకేరోజు 2వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా తీవ్రత తగ్గడంతో ఇంగ్లండ్‌లో మాస్కుధారణ, భౌతిక దూరం నిబంధనలను జూలై 19 నుంచి ఎత్తేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా బూస్టర్‌ డోసు ఆవశ్యకతపై చర్చ పుంజుకొంటోంది. ప్రపంచంలోని చాలా దేశాలు.. బూస్టర్ డోసు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.

కాగా.. డెల్టా, లాంబ్డా వంటి కరోనా వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నా, ప్రస్తుతానికి మూడో డోసు(బూస్టర్‌) అవసరం లేదని అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. రెండు డోసులు తీసుకున్నవారికి కొవిడ్‌ వల్ల మరణించే ప్రమాదం, ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు బాగా తక్కువ కాబట్టి- ఇప్పుడప్పుడే బూస్టర్‌ డోసు అక్కర్లేదని వివరించింది. బూస్టర్‌ డోసుకు అనుమతి కోరిన ఫైజర్‌, మోడెర్నా కంపెనీలకు ఈ విషయం స్పష్టం చేసింది. ఇంతలో ఆ రెండు కంపెనీలు ప్రత్యేకంగా డెల్టా వేరియంట్‌ పైనే పనిచేసే టీకాల రూపకల్పనను ముమ్మరం చేస్తున్నాయి. ఈ ఏడాది చివరకే క్లినికల్ ట్రయల్స్ షురూ చేస్తామంటున్నాయి. ఇక భారత్‌లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీకాల మిశ్రమం, బూస్టర్‌ డోసుల విషయంలో ప్రపంచ దేశాల అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది.