కఠినమైన ఆంక్షలతో…జర్మనీలో మళ్లీ లాక్ డౌన్

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2020 / 11:46 PM IST
కఠినమైన ఆంక్షలతో…జర్మనీలో మళ్లీ లాక్ డౌన్

ఓ వైపు అనేక దేశాలు తమ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంటే జర్మనీ మాత్రం మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించేందుకు రెడీ అయింది. కరోనావైరస్ కట్టడిలో భాగంగా డిసెంబర్ 16 నుంచి జనవరి 10 వరకు కఠినమైన దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించనున్నట్టు జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ ఆదివారం ప్రకటించారు.

రాబోయే క్రిస్మస్‌ను దృష్టిలో పెట్టుకుని కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకే జర్మనీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, కరోనా కారణంగా ఆరోగ్య రంగంపై అధిక భారం పడుకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మెర్కెల్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయంతో ఈ నెల 16 నుంచి జర్మనీలో అన్ని సంస్థలు మూతపడనున్నాయి.

అయితే నిత్యవసర వస్తులకు సంబంధించిన మాల్స్‌కు ఈ లాక్‌డౌన్ ఆదేశాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. క్రిస్మస్ సందర్భంగా కేవలం ఐదుగురు మాత్రమే ఒక చోట చేరడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. న్యూ ఇయర్ వేడుకలపైన జర్మనీ నిషేధం విధించింది. కాగా,జర్మనీలోని పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, ఇతర కేంద్రాలు నవంబర్ నుంచే మూతపడ్డాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరాయి.

మరోవైపు, మిగతా యూరోప్ దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి విషయంలో జర్మనీ మెరుగ్గానే ఉంది. అయితే, క్రిస్మస్ సమయంలో మరిన్ని జాగ్రత్త తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు. జర్మనీలో కరోనా కేసుల సంఖ్య 13లక్షల 20వేలు దాటగా..దాదాపు 22వేల కరోనా మరణాలు నమోదయ్యాయి.