ఇక సెలవు : అమెరికన్లు ట్రంప్ కు టాటా ఎందుకు చెప్పారు..కారణాలివే..

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 06:32 AM IST
ఇక సెలవు : అమెరికన్లు ట్రంప్ కు టాటా ఎందుకు చెప్పారు..కారణాలివే..

Goodbye Donald Trump : ట్రంప్ ఆశలు ఎందుకు తలకిందులయ్యాయి. రెండోసారి ప్రెసిడెంట్ పీఠమెక్కుతానన్న డొనాల్డ్ కు పరాభవం ఎందుకు ఎదురైంది. అమెరికన్లు ట్రంప్ కు టాటా చెప్పడానికి కారణమేంటి?  డొనాల్డ్ ట్రంప్.. గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు. మహిళలని చూడకుండా నోటికొచ్చినట్టు తిట్టేస్తాడు. అహంకారపూరితంగా వ్యవహరిస్తాడు. తానే కింగ్ నని ఫోజులు కొడతాడు. అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఓడిపోయే వరకు లెక్కలేనన్ని వివాదాల్లో ఉన్నారు ట్రంప్.



వ్యాపార వేత్త : –
విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరున్న ట్రంప్.. తన పాలనలో కీలకమైన సంస్కరణలు చేశారు. ఆ ఫలాలను ప్రజలు అనుభవించారు. కానీ, వివాదాస్పదుడిగా ఉన్న ముద్రను మాత్రం చెరుపు కోలేకపోయారు. చివరికి ఈ చెడ్డపేరు ఏ స్థాయిలో వచ్చిందంటే.. సర్వేల్లో ‘షై ట్రంప్‌ ఓటర్స్‌’అనే విభాగం కింద కూడా అంచనాలు తయారు చేశారు. అంటే తాము ట్రంప్‌కు ఓటు వేస్తామని చెప్పడానికి సిగ్గుపడేవారి కోసం దీన్ని ఏర్పాటు చేశారన్నమాట! దీనిబట్టి ఆయన ఇమేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆ వివాదాలే ట్రంప్‌ను గద్దె దించే వరకు తీసుకొచ్చాయి.



శాపంగా కరోనా : –
ఎన్నికలు వచ్చినప్పుడే కరోనా వ్యాపించడం ట్రంప్‌కు శాపంగా మారింది. టీకా కోసం ‘ఆపరేషన్‌ వార్‌స్పీడ్‌’, నిరుద్యోగులకు, కంపెనీలు ప్యాకేజీ వంటివి చేపట్టినా.. వ్యాప్తిని నిరోధించడంలో ట్రంప్‌ విఫలమయ్యారనే పేరొచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిన అధ్యక్షుడే వాటిని గాలికొదిలేశారు. దీంతోపాటు అంటువ్యాధుల నిపుణుడైన ఆంతోనీ ఫౌచీని తరచూ విమర్శించడం కూడా ట్రంప్‌పై వ్యతిరేకతను పెంచింది.



అత్యవసర బృందం రద్దు : –
పార్టీలతో సంబంధం లేకుండా అమెరికాలో ఆరుగురు అధ్యక్షుల వద్ద పనిచేసిన ఫౌచీని విమర్శించడం చాలా మంది అమెరికన్లకు నచ్చలేదు. దీనికి తోడు వైట్‌హౌస్‌లో మహమ్మారుల వ్యాప్తి సమయంలో స్పందించే అత్యవసర బృందాన్ని ట్రంప్‌ 2018లో రద్దు చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు అమెరికా అనుభవిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.



నల్లజాతీయుల ఆగ్రహం : –
రిపబ్లికన్ పార్టీ అంటే శ్వేతజాతీయుల పక్షం. దీనికి తోడు ట్రంప్‌పై మొదటి నుంచి నల్లజాతీయులు ఆగ్రహంగానే ఉన్నారు. జార్జిఫ్లాయిడ్‌ హత్య అనంతరం ఆ పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి వరకు శాంతియుతంగా సాగిన ట్రంప్ పాలనలో ఒక్కసారిగా హింస చెలరేగింది. నల్లజాతీయులకు భద్రతకు సంబంధించి విశ్వాసం కల్పించే చర్యలతో సమస్యను పరిష్కరించాల్సిందిపోయి.. బాధ్యతారాహిత్యమైన ప్రకటనలతో ట్రంప్‌ వివాదానికి ఆజ్యం పోశారు.



బంకర్ దాక్కోవాల్సిన పరిస్థితి : –
ఆందోళనకారులను దేశీయ ఉగ్రవాదులతో పోల్చారు. సైన్యాన్ని రంగంలోకి దింపుతానని రెచ్చగొట్టారు. ఫలితంగా ఆందోళనకారులు వైట్‌హౌస్‌ను చుట్టుముట్టడంతో భూగర్భ బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రంప్‌ నల్లజాతీయుల పట్ల చేసిన కామెంట్లు ఆయన ఓటమికి కారణమయ్యాయి.
ట్రంప్‌ నేరుగా కార్పొరేట్‌ ఆఫీస్‌ నుంచి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టారు. ఆయనకు కౌంటీ స్థాయిలో కూడా పాలనపరమైన అవగాహన లేదు. ఆయన ఏ దశలోనూ నేర్చుకోవడానికి ఇష్టపడలేదు.



నిలవని కార్యవర్గం : –
దీంతో ఆయన కార్యవర్గంలో ఎవరూ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్నాళ్లు పనిచేసి బయటకు వెళ్లిన తర్వాత ట్రంప్‌ లోపాలను ఎత్తిచూపడం ఒక ఆచారంగా మారిపోయింది. అమెరికా సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో మినహా ఆయన కార్యకవర్గంలో స్థిరంగా కొనసాగిన కీలక వ్యక్తులు ఎవరూ కనిపించరు. జేమ్స్‌ మ్యాటిస్‌ వంటి కరుడుగట్టిన సైనిక జనరల్స్ తలపట్టుకొని వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.



బెదిరిపోయిన ఓటర్లు : –
ఇక ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు ఆర్థిక మహా శక్తులు. అంతేకాదు, అమెరికాతో విడదీయరాని విధంగా సాంస్కృతిక సంబంధాలు కలిగిన దేశాలు. ముఖ్యంగా ఐరోపా దేశాలను అమెరికాకు దూరం చేసేలా ట్రంప్‌ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఓటర్లను బెదరగొట్టాయి. ‘ట్రంప్‌ వంటి మిత్రుడు ఉంటే చాలు.. ప్రత్యేకంగా వేరే శత్రువులు ఉండాల్సిన అవసరం లేదు’ అని ఐరోపా సంఘం అధ్యక్షుడిగా 2019 వరకు బాధ్యతలు నిర్వహించిన డొనాల్డ్‌ టస్క్‌ పేర్కోవడం పరిస్థితికి అద్దంపడుతుంది. ఐరోపా దేశాల నుంచి వచ్చే స్టీల్‌, ఆటోమొబైల్‌ వంటి వాటిపై భారీ టారీఫ్‌లు విధించడం.. నాటో వంటి కూటముల్లోని దేశాలను చిన్నచూపు చూడడం వంటి చర్యలు అమెరికాలోని ఐరోపా వాసులు ఓటింగ్‌ సమయంలో పునరాలోచించుకొనేలా చేశాయి.



వీసా నిబంధనలు : –
నాటో, జీ20 వంటి కూటముల్లో ట్రంప్‌ హయాంలో అమెరికా తన స్థాయిని తగ్గించుకుందనే అభిప్రాయం విద్యావంతుల్లో ఉంది. ఒక దశలో ఐరోపా దేశాలు కలిసి సైనిక కూటమిగా ఏర్పడాల్సిన సమయం ఆసన్నమైందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మాక్రోన్‌ ప్రకటించారు. ఒక్కసారి నాటో విచ్ఛిన్నం అయితే ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి గండిపడటం ఖాయం. ట్రంప్ ను మరోసారి గెలిపిస్తే ఆ ప్రమాదమూ లేకపోలేదని అమెరికన్లు భావించారు.
అమెరికా వీసా నిబంధనలను ట్రంప్‌ కఠినతరం చేయడం వంటివి దేశీయంగా ఉద్యోగాలను పెంచడానికే అని చెప్పినా.. అమెరికా పరిశ్రమలకు చౌకగా లభించే కార్మికులను దూరం చేసింది.



భర్తకు వ్యతిరేకం : –
అమెరికా చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చే హిస్పానిక్‌ ప్రజలను కట్టడి చేయడంతో వ్యవసాయ రంగంలోని కూలీల లభ్యతపై అది ప్రతికూల ప్రభావం చూపింది. చాలా రాష్ట్రాల్లో అమెరికా రైతుల పొలాల్లో ఎక్కువగా వీరే పనిచేస్తుంటారు. మెక్సికో నుంచి పొట్ట చేతపట్టుకొచ్చే వలస కూలీలను జైళ్లలో బంధించి.. వారి పిల్లలను ట్రంప్‌ ప్రభుత్వం గిడ్డంగుల్లో ఉంచింది. వీరిలో పాకే పసివారు.. పదేళ్లలోపు పిల్లలు కూడా ఉండటంతో అమెరికా సమాజం భావోద్వేగానికి లోనైంది. ఈ విషయంలో దేశ తొలి మహిళ మెలానియానే భర్తకు వ్యతిరేకంగా గళం విప్పారు.



పట్టించుకోని ట్రంప్ : –
ఇక వివిధ వృత్తుల్లో నైపుణ్యం ఉన్నవారిని అమెరికాకు తీసుకొచ్చి వారి సేవలను వినియోగించే అవకాశాలను కూడా ఆయన బిగించి వేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వీరు చాలా కీలకం. ఇవి బెడిసికొడతాయని నిపుణులు మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నా ట్రంప్ పట్టించుకోలేదు. ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాడు.



ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు : –
ఇక ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు అసలు లెక్కేలేదు. ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు చేయడం.. వెక్కిరించడం వంటివి హద్దులు దాటి ప్రజలు వెగటు పుట్టించాయి. ట్రంప్‌లో టమి భయం పట్టుకున్నాక ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘కొవిడ్‌ సమయంలో ప్రజా సంబంధాల్లో మాత్రమే విఫలమయ్యామని ట్రంప్‌ స్వయంగా అంగీకరించారు. ఒక్క కొవిడ్‌ విషయంలోనే కాదు.. గత నాలుగేళ్లగా ప్రజా సంబంధాల్లో విఫలం అయ్యారనే సంగతి ఇప్పటికీ కూ భావన అమెరికన్లలో పెరిగింది. అదే ఓటు రూపంలో ట్రంప్ ను గద్దెదింపింది.