Nigeria : నైజీరియా మసీదులో కాల్పులు,12 మంది మృతి, పలువురు కిడ్నాప్

నైజీరియాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. ఓ మసీదులోకి మారణాయుధాలతో చొరబడిని దుండగులు మసీదులోని ఇమామ్ సహా 12 మందిని కాల్చి చంపారు. పలువురిని బందీలుగా తీసుకెళ్లారు.

Nigeria : నైజీరియా మసీదులో కాల్పులు,12 మంది మృతి, పలువురు కిడ్నాప్

Nigeria : నైజీరియాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. పదిమందికిపైగా నేలకొరిగారు. అయినా దుండగుల రక్తదాహం తీరలేదు. పలువుని అపహరించుకుని తీసుకుపోయారు. మరి వారిని ప్రాణాలతో వదులుతారో లేదా చంపేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఓ మసీదులోకి మారణాయుధాలతో చొరబడిని దుండగులు మసీదులోని ఇమామ్ సహా 12 మందిని కాల్చి చంపారు. పలువురిని బందీలుగా తీసుకెళ్లారు. నైజీరియాలో బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు (బందిపోట్లు అని పిలిచే దుండగులు) ప్రజలపై దాడిచేసి చంపేయటం..ఎత్తుకుపోవటం పరిపాటిగా మారిపోయింది. ఈక్రమంలో ఆదివారం (డిసెంబర్ 4,2022) అధ్యక్షుడు ముహమ్మదు బుహారి సొంత రాష్ట్రమైన కట్సినాలోని ఓ మసీదుపై విరుచుకుపడి 12మందిని పొట్టనపెట్టుకున్నారు. తుపాకులతో కాల్చి 12మంది ప్రాణాలు తీశారు. పలువురిని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు.

మారణాయుధాలతో ప్రజల్ని దోపిడీ చేసి జీవించే కొంతమంది దుండగులు ఇటువంటి దారుణాలే కాదు రైతులు పంటలు పండించుకోవాలన్నా, వాటిని రక్షించుకోవాలన్నా ఈ ముఠాలకు ‘ప్రొటెక్షన్ ఫీ’ పేరుతో కప్పం చెల్లించుకోవాల్సిందే.లేదంటే ప్రాణాలమీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించాల్సిన దుస్థితి ఏర్పడింది. కిడ్నాపులకు పాల్పడే ఈ బందిపోట్లు డబ్బుల కోసం డిమాండ్ చేస్తారు. వారు డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే చంపేయటానికి కూడా వెనుకాడరు.

మైగమ్‌జీ మసీదు వద్దకు మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు ఒక్కసారిగా లోపల ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు ప్రారంభించారు. దీంతో కొంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. రాత్రి ప్రార్థనలకు వచ్చిన వారిలో మసీదు ప్రధాన ఇమామ్ తో సహా 12 మంది దుండగుల తూటాలకు బలయ్యారు. ఆ తర్వాత అక్కడున్న వారందరినీ ఒక్క చోట చేర్చిన దుండగులు అపహరించుకుపోయారు.

కట్సినా స్టేట్ పోలీస్ అధికార ప్రతినిధి గంబో ఇసా ఈ ఘటనను నిర్ధారించారు. స్థానికుల సాయంతో కిడ్నాప్‌కు గురైన వారిలో కొందరిని రక్షించామని తెలిపారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలోని కట్సినా సహా పలు రాష్ట్రాలు నైగర్‌ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య సాయుధ ముఠాలు యథేచ్ఛగా వీర విహారం చేస్తుంటాయి. బందిపోట్ల శిబిరాలపై నైజీరియా మిలటరీ దాడులు చేస్తున్నా వారి ఆగడాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎంతోమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.