అసలోడికే ఎసరు పెట్టారు: ట్విట్టర్ సీఈఓ అకౌంట్ నే హ్యక్ చేశారు

  • Published By: vamsi ,Published On : August 31, 2019 / 04:17 AM IST
అసలోడికే ఎసరు పెట్టారు: ట్విట్టర్ సీఈఓ అకౌంట్ నే హ్యక్ చేశారు

సోషల్ మీడియా ఎకౌంట్ల హ్యాకింగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా.. కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఇబ్బంది పెడుతున్న విషయం. రోజురోజుకు రెచ్చిపోతున్న హ్యాకర్లు ఏకంగా ట్విట్టర్ సీఈఓ ఎకౌంట్ కే ఎసరు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఎకౌంట్‌ను హ్యాక్ చేశారు హ్యాకర్లు. డోర్సీ ట్విట్టర్ ఎకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం(30 ఆగస్ట్ 2019) హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.

పదిహేను నిమిషాల పాటు డోర్సీ ఎకౌంట్‌ను హ్యాకర్లు వారి ఆధీనంలోకి డోర్సీ అకౌంట్ ను తీసుకున్నారు. అంతేకాదు.. డోర్సీ అకౌంట్లో అనుచిత వ్యాఖ్యలను కూడా పోస్ట్ చేశారు. రెచ్చొగొట్టే మెసేజ్‌లు పెట్టారు. దీంతో హ్యాకింగ్‌ను వెంటనే పసిగట్టిన ఎక్స్‌పర్ట్స్ డోర్సీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్ల నుంచి రక్షించారు. దుండగులు పోస్ట్‌ చేసిన అనుచిత సందేశాలను తొలగించి, వాళ్లు చేసి ట్వీట్లలో జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉన్నట్లు వెల్లడించారు.

మరోవైపు డోర్సీ ట్విటర్‌ ఎకౌంట్ ఎలా హ్యాక్‌ అయింది? అసలు భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ట్విటర్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. కంపెనీ చీఫ్‌ అకౌంట్ నే కాపాడలేనప్పుడు మిగిలిన యూజర్ల పరిస్థితి ఎంటని నెటిజన్లు ట్విట్టర్ ను నిలదీస్తున్నారు. అయితే మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం కారణంగా అకౌంట్ తో లింక్ చేసిన ఫోన్ నంబర్ ను హ్యక్ చేసి ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. అయితే ఇప్పుడు సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు తెలిపారు.