కరోనా భయంతో తెగ శానిటైజర్లు వాడేస్తున్నారా? ఈ స్టోరీ మీకోసమే

  • Published By: vamsi ,Published On : May 28, 2020 / 07:55 AM IST
కరోనా భయంతో తెగ శానిటైజర్లు వాడేస్తున్నారా? ఈ స్టోరీ మీకోసమే

కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కువగా ముసుగులు.. శానిటైజర్లు వాడుతున్నారు. వాస్తవానికి ఇది మంచిదే కానీ, అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నది శానిటైజర్‌ విషయంలోనూ వర్తిస్తుంది. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు సూచించిన శానిటైజర్లను విపరీతంగా వాడేస్తుండగా.. దాని వల్ల ప్రమాదం కూడా ఉందని అంటున్నారు డాక్టర్లు.

ఏదైనా ఒక సమయంలో.. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత శానిటైజర్లు వాడుకుంటే పర్వాలేదు కానీ, పదే పదే వాటితో చేతులు కడుక్కుంటే మాత్రం.. కరోనా వంటి వైరస్‌లను చంపేయడానికి ఉపయోగపడినా కూడా మంచి బ్యాక్టీరియాలను కూడా చంపే ప్రమాదం ఉందని, విపరీతంగా వాడితే నష్టాలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

శానిటైజర్ల వల్ల అరచేతుల్లోని చెడ్డ బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుందని, మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే రోగాల బారిన పడే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. సబ్బుతో చేతులు కడుక్కునే పరిస్థితి ఉంటే మాత్రం శానిటైజర్‌ వాడకపోవడం బెటర్ అని అంటున్నారు.

ఓ 20 సెకన్ల పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవటం ద్వారా క్రిముల్ని తరిమికొట్టొచ్చని, శానిటైజర్లే వాడాల్సిన అవసరం లేదని అంటున్నారు. మన చేతులపై దుమ్ము బాగా ఉన్నప్పుడు శానిటైజర్‌ను‌ ఉపయోగించొద్దని చెబుతున్నారు.

ఇక పిల్లలు చుట్టు ప్రక్కల ఉన్నపుడు శానిటైజర్‌కు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వారు గనుక శానిటైజర్‌ను శరీరంలోకి తీసుకున్నట్లయితే చాలా ప్రమాదం.

Read: చిన్నారులకు ఫేస్ మాస్కులతో జాగ్రత్త!