పాకిస్తాన్ లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టారు..వీడియో

పాకిస్తాన్ లో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టారు..వీడియో

Hindu temple destroyed పాకిస్తాన్ లో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు స్థానిక ముస్లింలు. బుధవారం(డిసెంబర్-30,2020) ఖైబర్ ఫంక్తువా రాష్ట్రంలోని ఖేరీ పట్టణంలోని ఓ ఆలయాన్ని స్థానిక ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో 1000కిపైగా ఉన్న ఓ హింసాత్మక గుంపు ధ్వంసం చేసింది. ఆలయ గోడలను..పైకప్పును ఇనుపరాడ్లతో ధ్వంసం చేయడంతోపాటు ఆలయానికి నిప్పుపెట్టారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆలయం సమీపంలో.. జామియాత్ ఉలేమా-ఇ ఇస్లా-ఫజల్ (JUI-F) బుధవారం ఓ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు ముస్లిం మతాధికారులు. దీంతో రెచ్చిపోయిన వందలమంది అల్లాహ్ ఓ అక్బర్ అని నినాదాలు చేస్తూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆవేశపూరిత గుంపు ఆలయంలోకి చొరబడి,గోడలు,పైకప్పు పగులగొట్టి ఆలయాన్ని తగలబెట్టారు. అయితే, ర్యాలీ తర్వాత ఈ సంఘటన జరిగినందున ఆలయం తగలబెట్టడంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జెయుఐ-ఎఫ్ నాయకుడు అమీర్ మౌలానా అటౌర్ రెహ్మాన్ అన్నారు.

కాగా,ఆలయాన్ని విస్తరించడానికి హిందువులు…అధికార యంత్రాంగం నుండి అనుమతి పొందారని, కాని స్థానిక ముస్లిం మతాధికారులు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ఒక గుంపును ఏర్పాటు చేశారని కరాచీకి చెందిన ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. పోలీసులు,స్థానిక అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉందని తెలిపారు. ఆలయాన్ని హింసాత్మక గుంపు ధ్వంసం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ జర్నలిస్ట్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్తాన్ లో మైనార్టీలైన హిందూ కమ్యూటీకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ చర్యను..పాకిస్తాన్ సహా ప్రపంచదేశాలకు చెందిన మానవహక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. స్థానిక పోలీసులు.. ఆలయం ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఉన్నారని..ఎందుకంటే ఆ గుంపు అల్లాహ్ ఓ అక్బర్ అని నినాదాలు చేస్తూ ఉన్నదని లండన్ కి చెందిన ఓ మానవహక్కుల కార్యకర్త ట్వీట్ చేశారు. ఇది నయా పాకిస్తాన్ అని ఆయన విమర్శించారు.