PUBG ఆడొద్దన్న భర్త.. విడాకులు కోరిన భార్య

పబ్ జీ.. పరిచయం అక్కర్లేని గేమ్. పిల్లలే కాదు.. అందరూ ఈ పబ్ జీ గేమ్ మాయలో పడిపోయారు.

  • Published By: sreehari ,Published On : May 2, 2019 / 02:17 PM IST
PUBG ఆడొద్దన్న భర్త.. విడాకులు కోరిన భార్య

పబ్ జీ.. పరిచయం అక్కర్లేని గేమ్. పిల్లలే కాదు.. అందరూ ఈ పబ్ జీ గేమ్ మాయలో పడిపోయారు.

పబ్ జీ.. పరిచయం అక్కర్లేని గేమ్. పిల్లలే కాదు.. చాలామంది యువతీ యువకులు ఈ పబ్ జీ గేమ్ మాయలో పడిపోయారు. క్షణం కూడా పబ్ జీ గేమ్ ఆడకుండా ఉండలేకపోతున్నారు. పబ్ జి పై పిచ్చితో.. అవసరమైతే బంధాలను కూడా కాదనుకునే స్థితికి చేరుకుంటున్నారు. పబ్ జీ ఆడొద్దని గట్టిగా హెచ్చరించిన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైందో భార్య. తన భర్త తనను పబ్ జీ గేమ్ ఆడకుండా అడ్డుకుంటున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది.

ఎలాగైన తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ యూఏఈలోని ఎమిరైట్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ ఆఫ్ ది సోషల్ సెంటర్ అజ్మాన్ పోలీసు, కెప్టెన్ వఫా ఖలీల్ ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు గల్ఫ్ న్యూస్ తెలిపింది. గేమ్ ను స్వేచ్ఛగా ఆడుకునే హక్కును కాలరాస్తున్న తన భర్త నుంచి విడాకులు ఇప్పించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఈ కేసును విచారిస్తున్న కెప్టెన్ అల్ హోసాని మాట్లాడుతూ.. ఆన్ లైన్ గేమ్ కు సంబంధించి నమోదైన కేసుల్లో ఇదొక వింతైన కేసుగా తెలిపారు. 

పబ్ జీ గేమ్ విషయంలో భార్యభర్తలిద్దరూ గొడవకు దిగడంతో హింసాత్మకంగా మారిందని, దీంతో మహిళ.. పోలీసుల సాయం కోసం స్టేషన్ కు వచ్చినట్టు చెప్పారు. పబ్ జీ ఆటలో తాను పరిమితులను దాటలేదని, ఇప్పటివరకూ చాట్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోలేదని బాధితురాలు వాపోయింది. పబ్ జీ గేమ్ ను స్నేహితులు, బంధువులతో మాత్రమే ఆడుతున్నానని తెలిపింది. పబ్ జీ గేమ్ ను ఆడకుండా తన భర్త అడ్డుకోవడం ఒక్కటే ప్రధాన కారణమని పోలీసులు తేల్చేసారు. తన భార్య ఎక్కడ పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అయిపోతుందనే భయంతోనే భర్త ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావించారు. 

భార్య విడాకులు కోరడంపై భర్త స్పందిస్తూ.. పబ్ జీ గేమ్ ఆడొద్దని చెప్పడం.. స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు కాదని అన్నాడు. కుటుంబంతో కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే తన భార్యను గేమ్ ఆడొద్దని పదేపదే హెచ్చరించినట్టు తెలిపాడు. కానీ, తన భార్య ఇలా సడన్ గా విడాకులు కోరుతుందని ఊహించలేకపోయానని భర్త చెప్పుకొచ్చాడు. పెద్దల సమక్షంలో భార్యభర్తలిద్దరికి కౌన్సిలింగ్ ఇప్పిస్తే తప్ప సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేదని పోలీసులు సూచించారు.