విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్….ఆన్‌లైన్ బోధన ఎంచుకున్నోళ్లకు అమెరికాలోకి “నో” ఎంట్రీ

  • Published By: venkaiahnaidu ,Published On : July 26, 2020 / 05:11 PM IST
విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్….ఆన్‌లైన్ బోధన ఎంచుకున్నోళ్లకు అమెరికాలోకి “నో” ఎంట్రీ

వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్… విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంలో మాత్రమే బోధనను కోరుకునే విదేశీ విద్యార్థులను ఇకపై అమెరికాలోకి అనుమతించేది లేదని ట్రంప్ సర్కార్ స్ప్రష్టం చేసింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఈ సెప్టెంబర్‌ నుంచి మొదలయ్యే సెమిస్టర్‌లో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులెవరూ దేశంలోకి అడుగు పెట్టకూడదని ICE ఆ ప్రకటనలో తెలిపింది. దీనికి కటాఫ్‌ తేదీని మార్చి 9గా నిర్ణయించింది. ఆ తేదీ తర్వాత కొత్త విద్యార్థులెవరైనా ఆన్‌లైన్‌ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటే అమెరికా రావడానికి వీల్లేదని ఐసీఈ స్పష్టం చేసింది.

కొత్తగా జాయిన్‌ అయిన విదేశీ విద్యార్థులెవరికీ ఫారమ్‌ 1–20 జారీ చేయవద్దంటూ దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను హోంల్యాండ్‌ సెక్యూరిటీలోని స్టూడెంట్స్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఈవీపీ) ఆదేశించింది. స్టూడెంట్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆ ఫారమ్స్‌ అత్యంత కీలకం. ఈ విద్యా సంవత్సరంలో భారత్‌కు చెందిన విద్యార్థులకే అత్యధికంగా అమెరికా విద్యాసంస్థల్లో సీటు వచ్చింది. కొత్తగా సీటు వచ్చిన భారతీయ విద్యార్థులు దాదాపుగా 2 లక్షల మంది వరకు ఉండవచ్చునని ఒక అంచనా. అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ, విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఆన్‌లైన్‌ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటున్నారు.

కాగా, ఇటీవల…. అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ట్రంప్‌ సర్కారు వివాదస్పద ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన హార్వర్డ్‌, ఎంఐటీ సహా దాదాపు 200 విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. సాంకేతిక దిగ్గజ కంపెనీలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ కూడా వీటికి మద్దతుగా నిలిచాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. అయితే తాజాగా ఆన్‌లైన్‌ బోధనను ఎంచుకునే విదేశీ విద్యార్థులకు తమ దేశంలోకి అనుమతి ఇవ్వబోమని ప్రకటించడం గమనార్హం. విద్యా సంస్థల్ని బలవంతంగానైనా తెరిపించడానికే ట్రంప్‌ ఇలా రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న ట్రంప్‌.. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేందుకు విద్యాసంస్థలు భౌతిక తరగతులు నిర్వహించేలా ఒత్తిడి తెస్తున్నారు. ఏవిధంగా స్కూళ్లు తెరువాలన్న అంశాన్ని ప్రభుత్వం రాష్ర్టాలకే వదిలిపెట్టింది. కాగా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషన్‌ ఎడ్యుకేషన్‌ గణాంకాల ప్రకారం.. 2018-19లో అమెరికాలో 10 లక్షలకుపైగా విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరు చెల్లించే ఫీజులపై అత్యధిక విద్యాసంస్థలు ఆధారపడి ఉన్నాయి.

వర్క్‌ పర్మిట్లలోనూ జాప్యం.. ట్రంప్‌ సర్కార్‌పై భారతీయ మహిళ దావా
అమెరికాలో హెచ్‌4 వీసాలపై ఉన్న జీవిత భాగస్వాములకు పని చేయడానికి వీలుగా జారీ చేసే వర్క్‌ పర్మిట్లలోనూ∙జాప్యం జరుగుతోంది. వర్క్‌ పర్మిట్‌ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగంపై భారత్‌కు చెందిన రంజిత సుబ్రహ్మణ్య అనే మహిళ ఓహియో ఫెడరల్‌ కోర్టులో దావా వేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ 7న తనకు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)కి ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు తనకు అది అందలేదని ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు ఉన్న ఈఏడీ గడువు జూన్‌లో ముగిసిపోవడం, కొత్తది అందకపోవడంతో తాను ఉద్యోగాన్ని కోల్పోయానని తెలిపారు. సాధారణంగా వర్క్‌ పర్మిట్‌కు అనుమతి వచ్చిన రెండు రోజుల్లోనే ఈఏడీ కార్డుని వారికి పంపాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 75 వేల కార్డులు ప్రింట్‌ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.