బాలీవుడ్ మూవీ క్లిప్ షేర్ చేసిన పాక్ ప్రధాని..నెటిజన్ల ట్రోలింగ్ తో డిలీట్
పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
Pakistan పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఓవైపు సైన్యంతో మరోవైపు విపక్షాలతో పోరాడుతున్నారు. తాజాగా విపక్షాల నుంచి బలపరీక్ష కూడా ఎదుర్కొన్నారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్నా..ఐక్యత లేకపోవడంతో ఇమ్రాన్ సర్కార్ ఊపిరిపీల్చుకుంటోంది.
ఇటీవల అధికార పీటీఐ అభ్యర్థి, పాకిస్తాన్ ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ సెనేట్ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడిన నేపథ్యంలో..ఇమ్రాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఆయన అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పి..గత నెలలో నిర్వహించిన విశ్వాస తీర్మానంలో గెలుపొందారు. ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూమెంట్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో బల పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ సులువుగా విజయం సాధించగలిగారు. అప్పటి నుంచి పీటీఐ ప్రభుత్వంపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలో తాజాగా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను బయటపెట్టే లక్ష్యంతో తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇమ్రాన్ ఖాన్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవినీతి శక్తులు పీటీఐ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదిగో ఇలాగే కుట్ర చేస్తున్నాయంటూ 1984నాటి బాలీవుడ్ చిత్రం ఇంక్విలాబ్లోని ఓ క్లిప్‌ను ఇన్ స్టాగ్రామ్ లో ఇమ్రాన్ ఖాన్ షేర్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోస్ట్ చేసిన ఈ బాలీవుడ్ క్లిప్‌లో ఖాదర్ ఖాన్ అనే అవినీతి రాజకీయ నాయకుడు తన పార్టీ సభ్యులతో ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి అనైతిక మార్గాల గురించి మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఈ వీడియోలోని నటుడి మాటలను ఇమ్రాన్ ఖాన్ తన రాజకీయ ప్రత్యర్థులతో పోల్చారు. తన ప్రత్యర్ధులు కూడా తన ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఇమ్రాన్ సంచలన ఆరోపణలు చేశారు.
అయితే, ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా రచ్చకెక్కడం, అది కూడా తాను గతంలో దిగజారుడు ఇండస్ట్రీ అంటూ విమర్శించిన బాలీవుడ్ సినిమాను అందుకు ఉపయోగించడం పట్ల నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో ఆయన వీడియోను డిలీట్ చేశారు.తద్వారా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ నైలా ఇనాయత్ అప్పటికే ఆ దృశ్యాలను క్యాప్చర్ చేసి.. ‘‘మంచిది.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను రక్షించేందుకు బాలీవుడ్ ముందుకు వచ్చిందన్న మాట’’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఇమ్రాన్ ఖాన్ పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియో యొక్క స్క్రీన్ రికార్డింగ్‌ను ట్వీటర్ లో షేర్ చేశారు. దీంతో మరోసారి ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.