భారత రైతుల పోరాటంపై ఎంపీ ప్రశ్న..బ్రిటన్ పీఎం ఏమన్నారో తెలుసా

  • Published By: madhu ,Published On : December 10, 2020 / 12:52 PM IST
భారత రైతుల పోరాటంపై ఎంపీ ప్రశ్న..బ్రిటన్ పీఎం ఏమన్నారో తెలుసా

Boris Johnson confuses farmers’ protest : భారతదేశ రాజధాని ఢిల్లీలో రైతులు కదం తొక్కుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ..గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై బ్రిటన్ పార్లమెంట్ లో లేబర్ పార్టీ సిక్కు ఎంపీ తన్మన్ జీత్ సింగ్ లేవనెత్తారు. దీనిపై ప్రధాని బోరిస్ జాన్సన్ సమాధానం ఇచ్చారు. కానీ..ఆయన సమాధానం ఇని అందరూ ఆశ్చర్యపోయారు. భారత్ – పాక్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సమాధానం ఇవ్వడంతో ఎంపీ తన్మన్ జీత్ బిక్కమొహం వేశారు. దీనికి సంబంధించిన వీడియోను Tanmanjeet Singh Dhesi MP ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.



గతంలో ఆయన పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. బుధవారం పార్లమెంట్ లో భారతదేశంలో రైతులు చేస్తున్న పోరాటంపై మాట్లాడారు. భారత్ లోని చాలా ప్రాంతాల్లో రైతులు శాంతిపూర్వకంగా నిరసనలు చేస్తున్నారని, కానీ..వారిపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని సభలో వెల్లడించారు. దీనిపై భారత ప్రధానికి చెబుతారా అన్నారు. కానీ..దీనిపై మాట్లాడటానికి బ్రిటన్ ప్రదాని బోరిస్ జాన్సన్ లేచారు. భారత్ – పాకిస్తాన్ తలెత్తిన అంశం ఆందోళన కలిగిస్తోందని, రెండు ప్రభుత్వాలు కలిసి ఒక పరిష్కారం కనుగొనాలని వెల్లడించారు. ఈ సమాధానం విన్న ఎంపీ తన్మన్ జీత్ సింగ్ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.



డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదంటున్నాయి రైతు సంఘాలు. కేంద్రం ప్రతిపాదనలను సైతం తిరస్కరించాయి. దేశవ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించాయి. ఢిల్లీ-జైపూర్ హైవే దిగ్బందనం చేస్తామని, బీజేపీ నేతలను ఘెరావ్‌ చేస్తామని పేర్కొన్నాయి. చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 14 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు తాజాగా కేంద్రం పంపిన ప్రతిపాదనలను తిరస్కరించారు. సింఘు సరిహద్దులో సమావేశమైన రైతు సంఘాలు చట్టాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనల్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు.



కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని స్పష్టం చేశారు. కొత్త చట్టాలను కేంద్రం రద్దు చేసేవరకు తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. డిసెంబర్ 12 ఢిల్లీ-జైపూర్ రహదారి దిగ్బంధనం, దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఆందోళన చేపడతామని రైతులు సంఘాలు వెల్లడించాయి. ఈ నెల 14న దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, బీజేపీ నేతలను ఘెరావ్‌ చేస్తామని ప్రకటించారు.