అద్భుత దృశ్యం : సముద్రంలో నీరు పైకి ప్రవహిస్తోంది!

  • Published By: sreehari ,Published On : January 10, 2020 / 12:42 PM IST
అద్భుత దృశ్యం : సముద్రంలో నీరు పైకి ప్రవహిస్తోంది!

అదో ఫేరోయి ద్వీపం.. అక్కడి సముద్రంలోని నీరు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రవహిస్తోంది. సుడిగాలి మాదిరిగా ఆకాశంలోకి నీరు చిమ్ముతోంది. కొండ శిఖరంపై వరకు ఒకే దారతో నీరు చిమ్ముతోంది. ఈ అరుదైన అద్భుతమైన దృశ్యం డెన్మార్క్ భాగమైన ఫెరోయి ద్వీపంలోని స్యూరోయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అదే సమయంలో అక్కడికి వెళ్లిన శామీ జాకబ్సెన్ (41) అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని బంధించాడు.

ఆ వీడియోలో కొండ అంచున సముద్రంలోని అలల తాకిడికి సుడిగుండం మాదిరిగా ఏర్పడింది. దీని ప్రభావంతో అల నుంచి నీళ్లు గాల్లోకి చిమ్ముతూ కొండ శిఖరం కొనపై పడుతున్నాయి. దీనిపై వాతావరణ నిపుణులు నీళ్లతో కూడిన సుడిగుండంగా విశ్వసిస్తున్నారు. ఒక పిల్లర్ మాదిరిగా గాల్లోకి నీళ్లు విరజిమ్ముతోందని అంటున్నారు. నీళ్లలో ఏర్పడిన సుడిగుండం ప్రభావంతోనే గాలి కింది నుంచి రౌండుగా తిరుగుతూ పైకి వస్తోందని చెబుతున్నారు. ఆ గాలి పీడనంతో పాటు నీళ్లు కూడా అలానే పైకి ఎగసిపడుతున్నాయన్నారు.

అక్కడి ప్రాంతమంతా భారీ జల్లులతో వాతావరణమంతా ఒక మాదిరిగా మారిపోవడంతోనే ఇలా సముద్రంలోని నీరు గాల్లోకి ఎగిసిపడుతున్నట్టు తెలిపారు. సాధారణంగా నీళ్లు పెద్దఎత్తున గాల్లోకి చిమ్మాలంటే దానికి కింది నుంచి అధిక స్థాయిలో పీడనం కావాలి. అప్పుడే నీరు గాల్లోకి చిమ్మడం జరుగుతుంది.