ఉగ్రవాదంపై ఉక్కుపాదం: భారత్,చిలీ ఒప్పందం

ఉగ్రవాదంపై ఉక్కుపాదం: భారత్,చిలీ ఒప్పందం

ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్,చిలీ దేశాలు సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు మంగళవారం(ఏప్రిల్-2,2019) అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం చిలీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

గనులు, సంస్కృతి, దివ్యాంగుల సాధికారతకు సంబంధించిన మూడు ఒప్పందాలపై కూడా ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఇండియా-చిలీ బిజినెస్ ఫోరంలో ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ… ఆర్థిక భాగ్యస్వామ్యం పెంపుదలకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. భారత్‌ కు లాటిన్ అమెరికా ప్రాంతంలో చిలీ ఆరో అతిపెద్ద భాగస్వామి అన్నారు.భారత్-చిలీ దేశాలు ఉగ్రవాదుల ఏరివేత,ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంతమొందించేందుకు సంయుక్తంగా కలిసి పనిచేస్తాయని తెలిపారు. చిలీ యూనివర్సిటీకి చెందిన యువ శాస్త్రవేత్తలతో కూడా రాష్ట్రపతి సమావేశమయ్యారు.

దైపాక్షిక చర్చల సందర్భంగా అమెరికా వీసా కలిగి ఉన్న భారతీయులు చిలీలో  వీసా లేకుండా ప్రవేశించవచ్చునని చిలీ ప్రకటించింది.చిలీ ప్రకటనను రాష్ట్రపతి కోవింద్ స్వాగతించారు.చిలీ నిర్ణయం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక,వ్యాపార బంధాలను ప్రమోట్ చేస్తుందని కోవింద్ అన్నారు.