చైనాను బతిమాలడం పాత మాట, మిస్సైల్స్ తో ఢీకొట్టడం నేటి వ్యూహం

  • Published By: sreehari ,Published On : September 29, 2020 / 06:38 PM IST
చైనాను బతిమాలడం పాత మాట, మిస్సైల్స్ తో ఢీకొట్టడం నేటి వ్యూహం

India-China border: Brahmos, Akash, Nirbhay missiles :  సరిహద్దులో ఇండియా , చైనా పోటాపోటీగా భారీ ఆయుధాలు మోహరిస్తున్నాయి. చైనా అత్యంత రహస్యంగా ఆయుధ సంపత్తి సరిహద్దులకు చేర్చింది. ఈ సంగతిని పసిగట్టింది ఇండియా. పొరుగుదేశం నుంచి ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోడానికి ఇండియా సిద్ధం అయ్యింది. అంతేనా? వ్యూహాత్మక ఆయుధాలను సరిహద్దులకు తానూ తరలించింది.

మరోపక్క, సాయుధ దళాలకు అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ నిర్ణయాలు తీసుకుంది. అదేసమయంలో సరిహద్దు ఉద్రిక్తతల సడలింపుపై రెండు దేశాల మధ్య దౌత్యస్థాయిలో ఈ వారం మరో విడత చర్చలకు రంగం సిద్ధం అయ్యింది .


చైనా సరిహద్దుల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభన ఎదుర్కోడానికి ఇండియా తన బ్రహ్మాస్త్రాన్ని మోహరించింది. బ్రహ్మోస్, ఆకాశ్, నిర్భయ్ మిస్సైల్స్‌ను చైనా సరిహద్ధుపై గురిపెట్టింది. కొన్నింటిని భారత ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఉంచారు . అలాంటి వ్యూహాత్మక ఆయుధాలు కొన్ని ఎయిర్ ఫోర్స్ మాత్రమే ప్రయోగిస్తోంది. మరికొన్ని నేవీ కి అప్పగిస్తారు.

చైనాకు చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ జిన్జియాంగ్ , టిబెట్ ప్రాంతాల్లో క్షిపణులు మోహరించింది. రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించవచ్చు . అందుకు ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను భారత మోహరించింది . భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్‌ క్షిపణులను కూడా భారత్‌ సిద్ధం చేసింది.



బ్రహ్మోస్‌ 500 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలదు. నిర్భయ్‌ 800 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది . 40 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్‌ ఛేదించగలదు. నిజానికి ఒక వేళ చైనా ప్రయోగించే ఏ మిస్సైల్ ఐనా, ఆకాశ్ ఆకాశంలోనే అడ్డుకోగలదు.

చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలో మోహరించింది. అంతేగాక వాస్తవాధీన రేఖ వెంబడి కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి తదితర ప్రాంతాల్లో కూడా మోహరించింది . అందుకు పోటీగా ఇండియా కూడా వ్యూహాత్మక ప్రాంతాల్లో క్షిపణులు మోహరించింది.



సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిస్ క్షిపణి ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఇది 300 కిలోగ్రాముల వార్‌హెడ్‌ను మోసుకుపోతుంది . టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్‌ క్షిపణి ధ్వంసం చేయగలదు. హిందూ మహాసముద్రం లోని ఎలాంటి యుద్ధనౌకనైనా నీటముంచగలరు. లద్దాఖ్‌ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్‌ సిద్ధంగా ఉంచింది. సుఖోయ్ యుద్ధ విమానాల నుంచి వీటిని ప్రయోగిస్తారు .

హిందూ మహా సముద్రంలోని కార్‌ నికోబార్‌ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా బ్రహ్మోస్ , నిర్భయ్‌ క్షిపణులను ప్రయోగించే వీలుంది. మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. అందుకోసం అక్కడ కూడా కొన్ని క్షిపణులు మోహరించారు .



ప్రస్తుతం భారత్‌ వద్ద నిర్భయ్‌ క్షిపణుల సంఖ్య పరిమితం. నిర్భయ్‌ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్‌ ప్రాంతంలో ఆకాశ్‌ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్‌ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను గురి చూసి కూల్చగలదు.

ఆకాశ్‌ క్షిపణిలోని రాడార్‌ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తిస్తుంది. అందులో 12 లక్ష్యాలపై దాడి చేస్తుంది . ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్‌ మిస్సైల్స్, బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను ఆకాశ్ కూల్చివేస్తుంది . ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్‌ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి . కానీ, కారాకోరం పాస్‌ దగ్గరలోని దౌలత్‌బేగ్‌ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి.