భారత్‌పై చైనా దాడి చేస్తుండటానికి అసలు కారణం?

  • Published By: Subhan ,Published On : May 21, 2020 / 02:04 PM IST
భారత్‌పై చైనా దాడి చేస్తుండటానికి అసలు కారణం?

భారత్‌ ఎంత తిప్పి కొట్టినా.. సహనంగా వ్యవహరిస్తున్నా.. చైనా కవ్వింపు చర్యలు ఆపడం లేదు..ఓ వైపు నేపాల్‌ని ఎగదోస్తూనే..మరోవైపు  బోర్డర్స్ దగ్గర భారత సైన్యంతో ఘర్షణకు దిగుతోంది..రెండు వారాల నుంచి ఇదే తరహా తీరు ప్రదర్శిస్తోన్న డ్రాగన్ కంట్రీకి మనపై ఎందుకింత కడుపు మంట?

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయా…? చైనా కావాలనే కవ్విస్తోందా..? నేపాల్‌ని మనపైకి ఎగదోస్తోందా..? ఇతర దేశాల నుంచి ఒత్తిడి తెచ్చి సందు చూసి మన భూభాగం కాజేసేందుకా…? రెండు వారాలుగా భారత సైన్యాన్ని రెచ్చగొడుతోన్న చైనా..లేటెస్ట్‌గా పాంగాంగ్ సరస్సు దగ్గర భారీగా గస్తీ పెంచింది.

లద్దాఖ్ ఈశాన్య ప్రాంతం దగ్గర మామూలుగా తిరిగే పెట్రోలింగ్‌ని మూడింతలు చేసినట్లు నిఘా వర్గాల సమాచారం.. దీంతో భారత్ కూడా పాంగాంగ్ సరస్సుకి పశ్చిమప్రాంతం వైపుగా నావికదళాన్ని అదే స్థాయిలో మొహరించింది.. మొత్తం 45 కిలోమీటర్ల మేర ఉన్న సరస్సు పరిధిలో భారత నావికదళం గస్తీని పెంచి.. చైనా సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది.

లద్దాక్ ఏరియాలో చైనా చర్యలతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఎప్పుడేం జరుగుతుందో తెలీని టెన్షన్ వాతావరణం నెలకొంది. పెట్రోలింగ్ చేసే బోట్ల సంఖ్య మూడు నుంచి 9కి పెంచడమే కాకుండా గస్తీ కాస్తున్న పద్దతిలోనూ చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని ఆర్మీ చెప్తోంది.

నెలరోజులుగా చైనా వ్యవహారశైలిలో మార్పు స్పష్టంగా కన్పిస్తుందని.. ఓ రకంగా యుద్ధానికే కవ్విస్తున్నట్లుగా దాని చేష్టలు కన్పిస్తున్నాయని మన ఆర్మీవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఏ పరిస్థితైనా ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దుల వద్ద సిద్ధమైంది.

వారం రోజులుగా లద్దాక్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు ఫింగర్ పాయింట్ల వద్ద చైనా..కావాలనే తన పరిధి దాటి మరీ భారత్‌ని కవ్విస్తోంది.. సరస్సు పరిధిలోని పర్వతప్రాంతాల్లోని ఉత్తరభాగాలను ఫింగర్ పాయింట్లుగా వ్యవహరిస్తుంటాయి. భారత్ ఈ ఫింగర్ పాయింట్లలో 8వ నంబర్ వద్ద నుంచి వాస్తవాధీన రేఖ వెళ్తుందని చెప్తుండగా.. చైనా మాత్రం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్.. ఫింగర్ పాయింట్ టు వద్ద పాస్ అవుతుందని వాదిస్తుంది.

అందుకే తాము అక్కడ గస్తీ నిర్వహిస్తున్నట్లు వాదిస్తోంది. ఫింగర్ పాయింట్ ఫోర్ వరకూ మన పరిధి కాబట్టే భారత సైన్యం ప్రత్యక్షంగా సైనికులతో పహారా కాస్తుంది. ఐతే చైనా మాత్రం రెండో ఫింగర్ పాయింట్ వద్ద..ఐదు పాయింట్ల వద్ద భారత సైన్యంతో ఈ నెల ఐదారు తేదీల్లో ఘర్షణకు దిగింది..

ఇదే సమయంలో చైనా సైనికులు తమ వాహనాలలో వచ్చి మరీ పెద్ద ఎత్తున లద్దాక్ సరిహద్దుల భారీగా పహరా నిర్వహించడానికి వీలుంది..1999లో భారత్ పాకిస్తాన్‌తో కార్గిల్ వార్‌లో బిజీగా ఉన్న సమయంలో చైనా గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ రోడ్డు మార్గం నిర్మించుకుంది. ఈ రోడ్డు మార్గంతో వారికి భారీగా వాహనాలతో సహా గస్తీకి వీలు కలిగింది..ఇందుకే ఈ మధ్యనే భారత్ కూడా గాల్వాన్ ఏరియాలో రోడ్డు నిర్మించింది.

చైనా తన అక్కసు వెళ్లగక్కుతోంది..తమ భూభాగంలో నిర్మాణాలు చేపడుతుంది కాబట్టే భారత సైన్యాన్ని చైనా సైనికులు నిలువరించారంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తోంది..అలానే  చైనా నిర్మించుకున్న రహదారి బాగా ఇరుకైనది కావడంతో..ఎప్పుడైతే చైనా సైనికులను మనవాళ్లు అడ్డుకుంటారో..వారి వాహనాలు వెనక్కి టర్న్ అవ్వడం కూడా కుదరదు..ఇది కూడా స్థానికంగా అప్పుడప్పుడూ రెండు దేశాల సైనికుల మధ్యా ఘర్షణలు పెరగడానికి కారణంగా పరిశీలకులు చెప్తుంటారు. 

ఐతే చైనా మాత్రం కరోనా వైరస్ విషయంలో ప్రపంచదేశాలు తనని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటంతో తట్టుకోలేకపోతోంది..దానికి తోడు అక్కడి కంపెనీల్లో చాలా వరకూ భారత్‌కి తమ కార్యాలయాలు తరలిస్తున్నాయనే ప్రచారంతో మింగలేక కక్కలేక నానా అవస్థలూ పడుతోంది..దానికి ముందే చైనా భారత్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం తప్పనిసరి చేసింది.

ఇందుకోసం ఎఫ్‌డిఐ పాలసీల్లోనే మార్పులు చేసింది. దీనిపై అప్పట్లోనే చైనా తన అభ్యంతరం తెలిపింది. తాజాగా వైరస్ పుట్టుకపై చైనాలో ఎంక్వైరీ జరగాల్సిందేనంటూ అమెరికాతో పాటు భారత్‌ కూడా గళం విప్పడంతో రగిలిపోతున్న చైనా..ఆ కసి అక్కసు ఏదోలా తీర్చుకోవడానికే ఇలా.. భారత సరిహద్దుల దగ్గర ప్రదర్శిస్తోందని స్పష్టమవుతోంది.